రామవరం, డిసెంబర్ 27 : సింగరేణిలో నవంబర్ 24, 25న జరిగిన మెడికల్ బోర్డు మరోసారి నిర్వహించాలని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ నాయకత్వంలో డైరెక్టర్ (పా) ను కలిసిన హరీశ్‌రావు అనంతరం మాట్లాడుతూ.. మారు పేర్ల సమస్యను పరిష్కరించి వారికీ న్యాయం చేయాలని సింగరేణి డైరెక్టర్ (ఫా) గౌతమ్ పొట్రును కోరడం జరిగిందన్నారు. ఎప్పుడో 1998లో బంద్ పెట్టిన తండ్రీ కొడుకుల ఉద్యోగాలను 2018 నుండి కేసీఆర్ కారుణ్య నియామకాల పేరుతో తండ్రుల ఉద్యోగాలు పిల్లలకి దాదాపు 15,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. కానీ రెండు సంవత్సరాల క్రితం ఎలక్షన్ల ముందు కార్మికుల ముందుకు కాంగ్రెస్ పార్టీ వారు వచ్చి కేసీఆర్ నెలకొక బోర్డు పెడితే తాము రెండు బోర్డులు నిర్వహిస్తామని, 250 గజాల స్థలం ఇప్పిస్తామని, రూ.30 లక్షలు వడ్డీ లేని రుణం ఇప్పిస్తామని, పెర్క్స్ మీద ఇన్‌కం ట్యాక్స్ రద్దు చేపిస్తామని ఇవేగాక అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రికగ్నైజేషన్లు, రీప్రజెంటేషన్ ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ యూనియన్స్ మెడికల్ బోర్డును పోగొట్టే ప్రయత్నం చేస్తుందని, ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని కార్మికులు ఎటు పోయినా ఎటువంటి ఇబ్బంది పడ్డా పర్లేదని తమ సొంత ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, ప్రధాన కార్యదర్శి సురేందర్ రెడ్డి, భూపాలపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ బడితల సమ్మయ్య, మెడికల్ బోర్డుకు సంబంధించిన బాధితులు పాల్గొన్నారు.

Ramavaram : సింగరేణిలో మరోసారి మెడికల్ బోర్డు నిర్వహించాలి : మాజీ మంత్రి హరీశ్‌రావు