కొత్తగూడెం ప్రగతి మైదాన్, జూలై 7 : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందింది మావోయిస్టు(Maoist) పార్టీ పీఎల్జీఏ చీఫ్, మోస్ట్ వాంటెడ్ హిద్మాకి సమీప బెటాలియన్ స్నైపర్ సోధీ కన్నాగా పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను బీజాపూర్ ఎస్పీ జితేంద్రయాదవ్ పాటిలింగం సోమవారం వెల్లడించారు. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియాలో ఈ నెల 5వ తేదీన జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందిన విషయం విదితమే. అయితే కాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టు హిద్మా కనుసన్నల్లో ఆపరేట్ చేయబడే(స్నైపర్) 1వ బెటాలియన్‌కి చెందిన 2వ కంపెనీ డిప్యూటీ కమాండర్ సోధీ కన్నాగా గుర్తించినట్లు ఎస్పీ ధ్రువీకరించారు.
ఈ ఆపరేషన్‌లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్, కోబ్రా 202, 210వ బెటాలియన్లతోపాటు సీఆర్పీఎఫ్ యంగ్ ప్లాటూన్లు సంయుక్తంగా పాల్గొన్నట్లు తెలిపారు. సోధీ కన్నాపై రూ.8 లక్షల రివార్డు ఉన్నదని, ఇతడు టేకల్‌గుడియం, ధర్మారం దాడుల్లో పాల్గొన్నాడని వివరించారు. సోధీ కన్నా మృతి చెందిన ప్రాంతం నుంచి ఒక ఏకే-47 మ్యాగజైన్, 59 రౌండ్లు, భారీ పేలుడు పదార్థాలు, ఇతర ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా.. గత ఏడాది నుంచి మొదలు ఇప్పటి వరకు 415 మంది హార్డ్ కోర్ మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతిచెందినట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు.