రామవరం, అక్టోబర్ 22 : సింగరేణి కొత్తగూడెం ఏరియా వెంకటేష్ ఖని మైన్ బొగ్గు గనిలో అధికారుల అరాచకాలను నిలిపివేయాలని హెచ్ఎంఎస్ (హింద్ మజ్జూర్ సభ) రాష్ట్ర అధ్యక్షుడు రియాక్ అహ్మద్ బహిరంగ లేఖలో బుధవారం డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను అణచివేస్తూ, ప్రమోషన్లు ఇవ్వకుండా, నియంత చర్యలు తీసుకుంటున్న యాజమాన్యంపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. సింగరేణిలో ఫ్రంట్ లైన్ సూపర్వైజర్స్ సెలవు రోజుల్లో పనిచేస్తే వారికి, కార్మికులు మూడు నెలలు గానీ, ఆరు నెలలు గాని విశ్రాంతి తీసుకునే హక్కు ఉన్నా, యాజమాన్యం బలవంతంగా పని చేయిస్తూ కార్మికులను వేధిస్తున్నట్లు ఆరోపించారు. కార్మికుల సమస్యల పట్ల స్పందన చూపడం లేదన్నారు.
గనిలో ఇద్దరు పంప్ ఆపరేటర్లు ఉండగలిగే చోట, యాక్టింగ్ పోస్టింగ్లు ఇస్తూ, జనరల్ అసిస్టెంట్లను పెట్టి పని చేయిస్తున్నారని ఆరోపించారు. ఇది కార్మికుల హక్కుల్ని హరించడమే కాకుండా, ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారిని నిరుత్సాహ పరుస్తోందన్నారు. వెంటనే ప్రమోషన్లు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పంప్ ఆపరేటర్ ఖాళీలను వెంటనే నింపాలని, అలాగే రెండవ షిఫ్టులో పనిచేసే కార్మికుల కోసం క్యాంటీన్ సదుపాయం కల్పించాలన్నది హెచ్ఎంఎస్ ప్రధాన డిమాండ్ అన్నారు.
గతంలోనూ ఈ సమస్యలపై యాజమాన్యానికి ప్రతినిధి బృందాలు వినతులు అందించాయని, అయినా స్పందన లేనందున ఈ బహిరంగ లేఖను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కంపెనీ భద్రత కోసమే కార్మికులు సేవలందిస్తున్నారని, అటువంటి వారిని వేధించడం సరికాదన్నారు. చట్టాలను పాటించడంలో యాజమాన్యం విఫలమైతే, హెచ్ఎంఎస్ న్యాయపరంగా పోరాడడానికి సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా రియాజ్ హెచ్చరించారు.