కొత్తగూడెం అర్బన్, మే 14 : కార్మికుల భవిష్యత్‌కి ప్రమాదకరంగా మారిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఇండస్ట్రీస్, పబ్లిక్ సెక్టార్ లను రక్షించాలని కోరుతూ ఈ నెల 20న చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకుడు భూక్యా రమేశ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం కొత్తగూడెం పట్టణంలో కార్మికుల పని ప్రాంతాల్లో సీఐటీయూ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. పలు సంస్థల యజమానులకు సమ్మె నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆయన నాయకులు మాట్లాడుతూ.. వందేండ్లు పాటుపడి కార్మికవర్గం కోసం సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేయడం అంటే కార్మికవర్గ హక్కులను కార్పొరేట్ వర్గాలకు తాకట్టు పెట్టడం తప్పా మరొకటి కాదన్నారు.
1991 నుండి నూతన ఆర్థిక విధానాలను అమలు చేయడం వల్ల దేశంలో తీవ్ర అసమానతలు పెరిగిపోయాయని, ఈ విషయాన్ని ఆక్స్‌ఫామ్ సంస్థ వెల్లడించిందన్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేసే లేబర్ కోడ్ల వల్ల కార్మిక హక్కులు హరించి, బానిస రోజులు రాబోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 2020లో పార్లమెంట్లో ఆమోదం పొందిన లేబర్ కోడ్ లను ఇప్పటి వరకు అమలు కానివ్వకుండా కార్మికవర్గం పోరాటాలను చేసిందన్నారు.
సామాజిక భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ చట్టాల్లో అనేక మార్పులు తెచ్చారని, ఈ మార్పులన్నీ కార్మికులను తీవ్ర అన్యాయానికి గురి చేసేవిగా ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే విధంగా ఉన్న లేబర్ కోడ్ ల రద్దు కోసమే ఈ నెల 20న సమ్మె తలపెట్టినట్లు చెప్పారు. సమ్మెకి మద్దతుగా సంయుక్త కిసాన్ మోర్చా గ్రామీణ భారత్ బంద్‌కి పిలుపు ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు రామకృష్ణ, రాధాకృష్ణ, శ్రీను, రవి, రాంబాబు, వెంకన్న పాల్గొన్నారు.