– 60 బస్తాల వరి ధాన్యం నీళ్లపాలు
– తడిసిన వడ్లతో రోడ్డెక్కి నిరసన తెలిపిన రైతు
జూలూరుపాడు, డిసెంబర్ 19 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గాంధీనగర్ పంచాయతీలోని గంగారం తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయలేదని వరి ధాన్యం ఆరబోసిన కల్లానికి నీళ్లు పెట్టి తన అక్కసును వెలిబుచ్చి రైతుకు భారీ నష్టాన్ని మిగిల్చాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈ సంఘటన గురువారం రాత్రి మండలంలో జరిగింది. గ్రామస్తులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగారం తండా గ్రామానికి చెందిన కొర్రా చిన్న రాములు రెండు ఎకరాల పొలంలో వరి పంటను సాగు చేశాడు. పంట కోసి పొలంలో కళ్లం చేసి సుమారు 60 బస్తాల ధాన్యాన్ని ఆరబెట్టి తన పనుల్లో నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలు జరగడంతో అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని చిన్న రాములును ఆదేశించాడు. 3 ఓట్ల మెజార్టీతో అధికార పార్టీ అభ్యర్థి విజయం సాధించాడు.
అయినా తాను బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయలేదని అధికార పార్టీ నాయకుడు కోపంతో పొలంలో ఆరబెట్టిన వడ్లపై కరెంట్ మోటర్తో సుమారు 60 బస్తాల ఒడ్లు తడిపాడు. వీటి విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని రైతు వాపోయాడు. వరి ధాన్యాన్ని తిరగబోద్దామని వెళ్లి చూడగా ధాన్యంలో మొత్తం నీరు పట్టి ఉందని తెలిపాడు. దీంతో రైతు కేకలు వేస్తూ చుట్టుపక్కల ఉన్న వాళ్లని పిలిచి ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేసినప్పటికి పూర్తిగా తడిసిపోవడంతో ధాన్యం రంగు మారింది. చుట్టుపక్కలవారు వచ్చి ఆ నీళ్లు ఆపే ప్రయత్నం చేశారు. అయినా సుమారు 60 బస్తాల వడ్లు తడిసిపోయాయి. దీంతో రైతు గ్రామంలోని రోడ్డుపై వరి ధాన్యాన్ని పోసి నిరసన వ్యక్తం చేశాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని తడిసిన వడ్లు పరిశీలించారు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Julurupadu : కాంగ్రెస్కు ఓటేయలేదని వరి ధాన్యాన్ని తడిపిన నాయకుడు