– 5వ రోజు దీక్షా శిబిరంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము
బూర్గంపహాడ్, మార్చి 30 : ఐటీసీ యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చాలని బీఆర్టీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు సానికొమ్ము శంకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో 5వ రోజు దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి కాంట్రాక్టు కార్మికులకు సంపూర్ణ మద్దతు పలికారు. కార్మికులకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కోకన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, బెల్లం నాగయ్య, యాకూబ్ పాషాలు మాట్లాడుతూ.. 13వ వేతన ఒప్పందంలో పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, 14వ వేతన ఒప్పందాన్ని జేఏసీతో కలిసి చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే కాంట్రాక్టు కార్మికుల ప్రధాన డిమాండ్ రూ.22 వేల వేతనం తగ్గకుండా అమలు చేయాలని, నూతన క్వార్టర్స్, షటిల్‌కోర్టు నిర్మాణంతో పాటు ఆంక్షలు లేకుండా వంద శాతం మెడికల్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం గేట్ మీటింగ్ నిర్వహించి కాంట్రాక్టు కార్మికుల సమస్యలను ప్రస్తావిస్తూ యాజమాన్యం దిగి రావాలని లేదంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రిలేదీక్షా కార్యక్రమంలో సందిపాము బాబు, కుందూరు శ్రీనివాసరెడ్డి, నీలకంఠం వెంకటేశ్వర్లు, అద్దనపు గోపాలరావు, షేక్ చాంద్‌పాషా, జేఏసీ సభ్యులు సింగారపు సతీశ్, కందాల వెంకటరెడ్డి, ఈతకోటి జాన్సన్ పాల్గొనగా మద్దతు పలికిన వారిలో చుక్కపల్లి బాలాజీ ఉన్నారు.