జులూరుపాడు, మే 14 : రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లాలో పశువుల అక్రమ రవాణాపై పోలీస్ యంత్రాంగం నిఘా తీవ్రం చేసిందని, నిబంధనలు ఉల్లంఘించి పశువులను తరలిస్తే కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలంలోని వినోభానగర్ సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టును గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించడంతో పాటు భద్రతా ఏర్పాట్లపై సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగ సీజన్ దృష్ట్యా గోవుల అక్రమ రవాణా జరిగే అవకాశం ఉన్నందున సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా వ్యూహాత్మక ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచామని ఆయన వివరించారు. కేవలం పశువుల రవాణానే కాకుండా గంజాయి, ఇసుక అక్రమ దందాలపైనా ఉక్కుపాదం మోపుతున్నామని, సరైన అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాలను తక్షణమే సీజ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేస్తూ, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ తనిఖీ కార్యక్రమంలో జులూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, ఎస్ఐ బాదావత్ రవి, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ చారి రాంబాబు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.