నీలగిరి, ఆగస్టు 15: నల్లగొండను అభివృద్ధిలో అగ్రభాగన నిలబెడతానని, పోరాటాల బాట నుంచి అభివృద్ధి దిశగా నల్లగొండను నడిపిస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను మంత్రి ఆవిష్కరించారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లా నీటి కష్టాలు తీర్చడానికైనా, ప్రగతి బాటలో ముందుంచడానికైనా తన ప్రాణాలైనా అడ్డుపెట్టి సర్వశక్తులా కృషి చేస్తానన్నారు.
ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తగిన వర్షపాతం లేనందున వరి పంటను తగ్గించి ప్రత్యామ్నాయంగా కంది, పెసర, మినుము, జొన్న, నువ్వులు, అలసంద, ఆయిల్‌పామ్, కూరగాయలు సాగు చేయాలని సూచించారు. 44,500 ఎకరాల్లో సాగు చేగు ప్రణాళిక రూపొందించి రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించామని చెప్పారు. జిల్లాలో మొదటి విడతలో 17,873 ఇండ్లు మంజూరు చేస్తే 11,048 గృహాలు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయన్నారు. జిల్లాలో నీటి పారుదల శాఖ ప్రాజెక్టులు, లిఫ్ట్ సీంలకు 1,194 ఎకరాల భూసేకరణ చేసి రూ.215 కోట్లు చెల్లించామని తెలిపారు. ఎస్ఎల్బీసీ సొరంగం 44 కి.మీలకుగాను 35 కి.మీల వరకు పనులు పూర్తి కాగా మిగిలిన 9 కి.మీల పనులు త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు.
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ లైనింగ్ పనులకుగాను రూ.54 కోట్ల ఎంఎఆర్పీ ప్రాజెక్టులో హైలెవల్ కెనాల్ లైనింగ్ పనులకు రూ.442 కోట్లు, లోలెవల్ కెనాల్ లైనింగ్ పనులకు రూ.44.22 కోట్లు మంజూరు చేసి ప్రారంభించినట్లు తెలిపారు. బ్రాహ్మణ వెల్లంల లిఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణ పనులు 90 శాతం చేశామని, యాసంగి పంటకు 2 లక్షల 61 వేల ఎకరాలకు సాగు నీరు అందించామన్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా హెడ్ రీచ్‌లో రూ.1,800 కోట్లు, దేవరకొండ నియోజకవర్గంలోని గుండ్లపల్లి మండలంలో రూ.20 కోట్లతో మంజూరై పనులు ప్రారంభమైనట్లు తెలిపారు.
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో ఇప్పటి వరకు 4 యూనిట్ల నిర్మాణం పనులు పూర్తి చేసుకొని వాణిజ్య విద్యుత్ ఉత్పత్తిని ఇప్పటికే ప్రారంభించుకున్నామని తెలిపారు. రోజూ 76.8 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. ఒక యూనిట్ నిర్మా ణం ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంఎల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ అమ్రేర్ అలీ తదితరులు ఉన్నారు.