రుద్రంపూర్, జూన్ 19 : కొత్తగూడెం ఏరియాలోని ఆర్సిహెచ్పి (RCHP), రుద్రంపూర్ రైల్వే సైడింగ్లను శుక్రవారం కోల్ మూవ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వెంకన్న (IRTS) సందర్శించి బొగ్గు రవాణా ఏర్పాట్లను పరిశీలించారు. సందర్శనలో భాగంగా ఆయన బొగ్గు లోడింగ్, రవాణా సదుపాయాలు, మౌలిక వసతులు, నిర్వహణ విధానాలను పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. బొగ్గు రవాణా ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా అవసరమైన సూచనలు చేశారు. అనంతరం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయ ప్రాంగణంలో నిర్మించనున్న ఆలయానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బి. వెంకన్న మాట్లాడుతూ, కార్యాలయ ప్రాంగణంలో ఆలయ నిర్మాణానికి చేపట్టిన భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉద్యోగుల్లో సానుకూల ఆలోచనలను పెంపొందించడమే కాకుండా ప్రశాంతమైన కార్యాలయ వాతావరణం ఏర్పడేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. నిర్మించనున్న ఆలయం ఉద్యోగులు, కార్మికులకు ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించి వారి మనోధైర్యాన్ని పెంపొందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు, ఎస్.ఓ. టు జీఎం ఎం. గోవిందరావు, పర్సనల్ మేనేజర్ ఎల్. తిరుపతి, ఏజీఎం (ఫైనాన్స్) బీభత్స, ఇన్చార్జ్ (హెచ్వోడీ) సివిల్ కె. రాజారాం, ఏరియా ఇంజనీర్ వి. రామకృష్ణ, సీనియర్ ఎస్టేట్ ఆఫీసర్ బి. తౌర్య, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కె. శ్రీనివాస్, ఏఐటీయూసీ అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ గట్టయ్య, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ రజాక్, ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రటరీ సాగర్, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ సౌజన్యతో పాటు ఇతర అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ఆర్సిహెచ్పి, రుద్రంపూర్ రైల్వే సైడింగ్లలో బొగ్గు రవాణా ఏర్పాట్ల పరిశీలన