న్యూఢిల్లీ, జూలై 23 : జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఆహారం ఎలా? అర్ధాకలితోనే వారు నిరసన కొనసాగిస్తున్నారా? అన్న సందేహం అందరికీ రావడం సహజం. అయితే అక్కడి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అడగక పోయినా దేశ విదేశాల నుంచి సానుభూతితో వందలాది మంది ఆన్లైన్లో ఆహారాన్ని ఆర్డర్ ఇచ్చి ఆందోళనకారుల ఆకలిని తీరుస్తున్నారు. తమకు వస్తున్న ఆదరణను చూసి ఆశ్చర్యానికి గురయ్యామని నిర్వాహకులు సైతం తెలిపారు.
ఆందోళనలో పాల్గొంటున్న నిరసనకారులకు దేశవ్యాప్తంగా పలు చోట్ల నుంచి, అలాగే విదేశాల నుంచి కూడా పలువురు పెద్దమొత్తంలో ఆహార పదార్థాలను స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ యాప్ల ద్వారా పంపుతున్నారు. ఇలా పంపుతున్న ఆహారంలో ఎక్కువగా పిజ్జాలు, బర్గర్లు, మోమోలు ఉంటున్నాయి.