న్యూఢిల్లీ: బయటకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పిన హైదరాబాద్ యువతి ఏకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళన వద్దకు వెళ్లి పాల్గొనడం ఆశ్చర్యపరిచింది. ఫ్లయిట్ అటెండెంట్‌గా పనిచేస్తున్న దిశా శర్మ ఇటీవల ఇంట్లోంచి బయలుదేరి నేరుగా ఢిల్లీ వెళ్లే విమానం ఎక్కేసింది.
విమానం ఎక్కే ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో షేర్ చేసింది. ఢిల్లీ వెళ్లేందుకు హైదరాబాద్‌లో ఒంటరిగా విమానం ఎక్కానని, చాలా భయమేస్తున్నదని ఆమె పేర్కొంది. ఢిల్లీ వెళ్లడానికి తన ప్రయాణ చార్జీల కోసం విరాళాలు సేకరించినట్టు తెలిపింది. అంతేకాకుండా జంతర్ మంతర్ వద్ద నిరసనలో ఉన్న వారికి అందజేసేందుకు తాను మందులు, నిత్యావసరాలు కూడా సేకరించి పట్టుకెళ్తున్నట్టు తెలిపింది. తనకు ఢిల్లీలో ఎవరూ తెలియదని, ఆందోళనకారులతోనే ఉంటానని పేర్కొంది.