కృష్ణా నీళ్లలో మనకు దక్కిన వాటానూ వాడుకోలేకపోతున్న రేవంత్ ప్రభుత్వం ఒకవైపు.. పరిమితికి మించి యథేచ్ఛగా వాడుకుంటున్న ఏపీ మరోవైపు! విచిత్రమేమిటంటే.. విచ్చలవిడిగా నీటిని మళ్లించు కుంటున్న ఏపీకి పనిగట్టుకొని వరదనీటిని పారిస్తున్నది రేవంత్ ప్రభుత్వం. మూడేండ్లుగా ఇగురం లేని ప్రభుత్వం చేజేతులా వదిలేసుకున్న తెలంగాణ వాటా నీళ్లు 200 టీఎంసీలకు పైనే! మన వాటాను పూర్తిగా వాడుకున్నా.. పాలమూరు ప్రాజెక్టులు ఈ రోజు కృష్ణానీళ్లతో కళకళలాడేవి. పంటలకు పారేవి. కానీ ఇప్పుడా ప్రాజెక్టులు పడావు పడ్డాయి. పంటలు ఎండుతున్నాయి. నీళ్లివ్వండి మహాప్రభో.. అని రైతులు రోడ్డెక్కుతున్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): రేవంత్ సర్కార్ అందిస్తున్న సహకారంతో పొరుగున ఉన్న ఏపీ ప్రభుత్వం నీళ్ల దోపకానికి బరితెగిస్తున్నది. ఏ యేటికాయేడు మళ్లించుకుపోయే నీటి పరిమాణాన్ని పెంచుకుంటూ పోతున్నది. కాంగ్రెస్ సర్కార్ గడిచిన మూడేండ్లలో తెలంగాణ వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదు. తద్వా రా దాదాపు 200 టీఎంసీలకు పైగా జలాలను ఏపీకి ధారాదత్తం చేసింది. ఏపీ రికార్డు స్థాయిలో కృష్ణా జలాలను వినియోగించుకుంటుండగా, తెలంగాణ అత్యంత కనిష్ఠ స్థాయిలో మళ్లించుకున్న దుస్థితి నెలకొన్నది. కృష్ణా ఉమ్మడి ప్రాజెక్టులకు వచ్చిన జలాల్లో తాత్కాలిక కోటా మేరకు 66:34 నిష్పత్తిలో ఇరు రాష్ర్టాలు వినియోగించుకోవాల్సి ఉం టుంది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సగటు కృష్ణాజలాల వినియోగం 228 టీఎంసీలు మాత్రమే.
కేసీఆర్ హయాంలో కృష్ణా నుంచి గరిష్ఠ స్థాయిలో నీటిని వినియోగించుకోగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ పరిస్థితి తారుమారైంది. ఏటికేడు కృష్ణాజలాల వినియోగం మళ్లీ పడిపోతున్నది. 2024-25 నీటిసంవత్సరంలో కేవలం 26 శాతం జలాలను మాత్రమే వినియోగించుకోగా, 2025-26లో మరింత తక్కువగా 25.10 శాతం మాత్రమే వినియోగించుకున్నది. గడచిన పన్నెండేండ్ల కాలంలో ఇదే అత్యంత కనిష్ఠం కావడం గమనార్హం. జలాల వినియోగంపై పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని దీన్నిబట్టే తెలిసిపోతున్నది. తాత్కాలిక కోటా జలాలను సైతం వినియోగించకుండా దాదాపు 200 టీఎంసీలకు పైగా జలాలను ఏపీకి జారవిడిచింది.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గరిష్ఠ జలాలను వినియోగించింది. నాడు చేపట్టిన మిషన్ కాకతీయతోపాటు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, పెండింగ్ ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ను పూర్తిచేసిన ఫలితంగా తెలంగాణలో కృష్ణాజలాల వినియోగం పెరిగింది. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల కాలంలో సగటు వినియోగం 228 టీఎంసీల నుంచి 284 టీఎంసీలకు చేరుకున్నది. 2019-20 నీటిసంవత్సరంలోనే కొత్త చరిత్రను తిరుగరాసింది. మునుపెన్నడూ లేనిధంగా 367 టీఎంసీలను గరిష్ఠంగా నాడు తెలంగాణ వాడుకున్నది.
ఏపీ గతంలో ఎన్నడూ లేనంతగా రికార్డుస్థాయిలో కృష్ణా జలాలను మళ్లించుకుపోయింది. 2025-26 నీటిసంవత్సరంలో మొత్తంగా 777 టీఎంసీలను తరలించుకుపోగా, కోటాకు మించి 43 టీఎంసీలను వాడుకొని రికార్డును బ్రేక్చేసింది. శ్రీశైలం నుంచి మునుపెన్నడూ లేనివిధంగా 253 టీఎంసీలను మళ్లించుకుపోయింది. ఈ ఏడాది (2026-27) ఇప్పటివరకు 327 టీఎంసీలు వరద రాగా.. అందులో ఇరు రాష్ర్టాలు వాడుకున్నది 171 టీఎంసీలు. ఇందులోనూ దాదాపు 90 టీఎంసీల వరకు ఏపీ మళ్లించుకున్నది. తెలంగాణ వినియోగించింది కేవలం 69 టీఎంసీలే. ఇప్పటికీ 150 టీఎంసీలు అందుబాటులో ఉన్నయ్. అయినా వాటిని వినియోగించుకోవడం లేదు. ఈ వైఫల్యానికి ప్రధాన కారణం కాంగ్రెస్ సర్కారేనని స్పష్టంగా తెలిసిపోతున్నది. కృష్ణాలో వరద ప్రవాహాలు ప్రారంభంకాగానే ఏపీ నీటి మళ్లింపును షురూ చేసింది. తెలంగాణ సర్కార్ మాత్రం చోద్యం చూస్తున్నది. దీంతో వాటా జలాలనూ వినియోగించుకోలేని దుస్థితి నెలకొన్నది. జూరాల నుంచి దిగువన శ్రీశైలం రిజర్వాయర్‌కు నీరు తరలిపోగా, అక్కడి నుంచి ఏపీ తన్నుకుపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఏపీ దోపిడీకి తెలంగాణ సర్కారే ఊతమిస్తున్నది.
నర్సింహులపేట, అక్టోబర్ 3: గ్రామంలో విద్యుత్తు సమస్య తలెత్తితే ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడంతో.. ప్రమాదమని తెలిసినా రైతులు కరెంట్ స్తంభాలు ఎక్కి వైర్లు సరిచేసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రూప్లాతండా శివారు బీల్యాతండా వ్యవసాయ బావులకు కరెంటు సరఫరా అయ్యే ట్రాన్స్‌ఫార్మర్‌లో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయి. ఓవర్‌లోడ్ కారణంగా జంపర్లు కట్ అవడం.. ట్రాన్స్‌ఫార్మర్‌లో ఫ్యూజులు కొట్టేయడంతో కరెంటు సరఫరా నిలిచిపోయి పంటలు ఎండుతున్నాయి. అధికారులకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో రైతులే కరెంట్ స్తంభం ఎక్కి తెగిన వైర్లను సరి చేసుకుంటున్నారు.
భైంసా టౌన్, అక్టోబర్ 3 : నిర్మల్ జిల్లా భైంసా మండలం బిజ్జూర్ను కరువు ప్రాంతంగా ప్రకటించాలని రైతులు ఆందోళనకు దిగారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవక, పంటలు పండక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని శనివారం ఉదయం దాదాపు వంద మందికిపైగా రైతులు గ్రామ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కరువు కోరల్లో చిక్కుకున్న తమ ప్రాంతాన్ని తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించి, ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు సిరిపురం మేజర్ కాలువ కింద సాగు చేస్తున్న రైతులకు వెంటనే గోదావరి జలాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా తల్లాడ నీటిపారుదల శాఖ కార్యాలయం ఎదుట మూడు గ్రామాల రైతులు శనివారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఆందోళనలో బిల్లుపాడు, జగన్నాథపురం, గాంధీనగర్తండాకు చెందిన రైతులు పాల్గొన్నారు.



