టేకులపల్లి, మార్చి 28: ఇసుకను అక్రమంగా రవాణా చేసే అక్రమార్కుల ఆగడాలు రోజురోజుకీ ఎక్కువైతున్నాయి. ఫారెస్టు అధికారులపై దాడికి యత్నం చేసిన సంఘటన చంద్రు తండా సమీపన చోటు చేసుకుంది. కొత్తగూడెం జిల్లా (Kothagudem) టేకులపల్లి మండలం శంభుని గూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ఫారెస్ట్ ఏరియాలో మొర్రేడు వాగు నుంచి ఐదు ట్రాక్టర్లతో ఇసుక అక్రమంగా తరలిస్తుండగా అదే సమయంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లు ఇసుక రవాణాను అడ్డుకునే యత్నం చేశారు. దీంతో డ్రైవర్ ట్రాక్టర్‌ను ఫారెస్ట్ అధికారులపైకి మీదికి తీసుకెళ్లారు. గమనించి సిబ్బంది తప్పుకోవడంతో ట్రాక్టర్లు చంద్రు తండా గ్రామంలోకి వెళ్లిపోయాయి.
భయభ్రాంతులకు గురైన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ హారిక.. కొత్తగూడెం ఫారెస్ట్ రేంజర్ ఆఫీసర్‌కు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్, డీఆర్ఓ తోల్లెం వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి వచ్చి పోలీసుల సహకారంతో ట్రాక్టర్ ఓనర్లను గుర్తించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో చంద్రు తండా గ్రామస్తులకు, ఫారెస్ట్ అధికారుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజర్ మాట్లాడుతూ ఫారెస్ట్ ప్రాంతాల నుంచి ఇసుకను తరలించే పర్మిషన్ లేదని ఎవరైనా తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇట్టి విషయంపై ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ హారిక టేకులపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వేరువేరు ప్రాంతాల్లో రెండు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని వాటి ఓనర్లపై కేసు నమోదు చేశారు. ట్రాక్టర్లను సీజ్ చేశారు.