రామవరం, మే 14 : కేవలం సంస్థ రికార్డులో మాత్రమే పేరు ఉంటూ విధులకు గైర్హాజరు అయ్యే ఉద్యోగుల వల్ల సంస్థకు ఉపయోగం ఉండదని, ఉత్పత్తి లక్ష్యాలను సాధించే, రికార్డు నెలకొల్పే ఉద్యోగులు కావాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు అన్నారు. బుధవారం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ ఆర్ సి ఓ ఏ క్లబ్లో విధులకు గైర్హాజరు అవుతున్న ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బయట నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలన్నారు. చాలామంది సంవత్సరానికి కనీసం వంద మాస్టర్ల కంటే తక్కువగా డ్యూటీలు చేస్తున్నారని దీనివల్ల ఇటు సంస్థతో పాటు, మీ కుటుంబ సభ్యులు కూడా నష్టపోతున్న విషయాన్ని గమనించాలన్నారు. మరికొందరు ఇక్కడ డ్యూటీలకు గైర్హాజరు అవుతూ దుబాయ్, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇతర సంస్థలలో పని చేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఉద్యోగం వద్దు అనుకునేవారు, ఎందుకు జాయిన్ అయ్యారని మీ వల్ల ఇంకోకరిరి ఉపాధి పోయిందన్నారు.
సంస్థలో ఒక నెల పూర్తి డ్యూటీ చేస్తే కేవలం అలయన్స్ ద్వారా సుమారు రూ.20 వేల వరకు సంస్థ చెల్లిస్తుందని, దేశంలో ఏ సంస్థలో లేనటువంటి సదుపాయాలు సింగరేణి కల్పిస్తుందని తెలిపారు. కేవలం ఏరియాలోని పీవీకే ఫైవ్ ఇంక్లైన్లో 700 మంది విధులకు హాజరు కావాల్సి ఉండగా సగటున రోజుకు 342 మంది గైర్హాజరవుతున్నారని, ఇలా అయితే సంస్థ నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు ఎలా సాధ్యమవుతుందన్నారు. ఇప్పటికే చాలాసార్లు కౌన్సిలింగ్ ఇచ్చామని, అయినా చాలామందిలో మార్పు రావడం లేదని ఈసారి నిర్ణయం చాలా కటువుగా ఉంటుందని హెచ్చరించారు. ఏరియాలో ఈ రోజు 329 మందికి కౌన్సిలింగ్ ఇస్తున్నామంటే, గైర్హాజరు తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండీ.రజాక్, ఏఐటీయూసీ నాయకుడు గట్టయ్య, ఏజెంట్ బూర రవీందర్, పీవీకే మేనేజర్ శ్యాం ప్రసాద్, వైద్యులు శ్రీనివాస్‌రెడ్డి, పర్సనల్ మేనేజర్ శివ కేశవులు, సీనియర్ పీఓ మురళి, సంఘమిత్ర సంక్షేమ అధికారులు షకీల్, హరీశ్, గోవర్ధన్, ఖలీల్ అహ్మద్, దేవదాసు, సందీప్, కావ్య, కార్మిక నాయకుడు హుమాయిన్, చిలక రాజయ్య, ఆంజనేయులు, సేవా కో ఆర్డినేటర్ సాగర్, ప్రసాద్, ఉమర్, కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Ramavaram : తీరు మారకుంటే చర్యలు తప్పవు : జీఎం శాలెం రాజు