– సీపీఎం ఆధ్వర్యంలో సారపకలో ఆందోళన
బూర్గంపహాడ్, మే 26 : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ప్రధాన సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బాల నర్సారెడ్డి పాల్గొని మాట్లాడుతూ సామాన్యులపై మోదీ ప్రభుత్వం ధరల పెంపుతో ఎనలేని భారం మోపుతుందని, దేశ వ్యాప్తంగా నిరుపేద ప్రజలు నిత్యావసర సరుకులు సైతం కొనుక్కోలేని దుస్థితిలో ఉన్నారని ఆరోపించారు. ఉప్పు దగ్గర నుంచి పప్పు, మంచినూనె, ప్రజోపకరమైన నిత్యావసరాలు సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని, కార్పోరేట్ శక్తులకు సంపదను దోచిపెడుతుందని మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటివరకు ధరల మోతతో సామాన్యులకు నడ్డి విరిగేలా ఉందన్నారు.
ఇప్పటివరకు నాలుగుసార్లు పెట్రో, వంటగ్యాస్ ధరలు పెంచి వినియోగదారులు, సామాన్యుల నెత్తిన గుదిబండలా కేంద్రం తయారైందని మండిపడ్డారు. ఇప్పటికైనా పెంచిన ధరలను తగ్గించాలని, లేకుంటే సీపీఎం ఆధ్వర్యంలో మున్ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, మండల కమిటీ సభ్యులు పాపినేని సరోజిని, ఎస్కె. అబీదా, బయ్యా రాము, గుంటుక కృష్ణ, పాండవుల రామనాథం, కనకం వెంకటేష్, రాంబాబు పాల్గొన్నారు.