రుద్రంపూర్, జూలై 27 : సింగరేణి కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో, వీకేసీఎం ప్రాజెక్టు ప్రభావిత, పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా సోమవారం గరీబ్పేట్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో వైద్య నిపుణులు గ్రామ ప్రజలకు రక్తపోటు, మధుమేహం తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. అలాగే ఆరోగ్య పరిరక్షణ, జీవనశైలి మార్పులు, వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. శిబిరానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు.
ప్రజల ఆరోగ్య సంక్షేమమే లక్ష్యంగా సింగరేణి సంస్థ ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను నిరంతరం నిర్వహిస్తోందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ లలిత కుమారి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు సింగరేణి నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గరీబ్పేట్ సర్పంచ్ దివ్యతేజ, హెల్త్ ఆఫీసర్ లలిత కుమారి, వెల్ఫేర్ ఆఫీసర్ విక్టర్, ఏఐటీయూసీ ఫిట్ సెక్రటరీ ఎం.ఆర్.కే. ప్రసాద్, ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రటరీ గోపు కుమార్, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.