‘ఏం కళ్లు నెత్తికెక్కాయా…’ అన్నమాట తెలుగులో వింటుంటాం. ‘లేదు… ఫ్యాషన్ నెత్తికెక్కింది!’ అని చెప్పాలేమో ఈ యాక్సెసరీ పెట్టుకుంటే! అదేం పొగరుబోతు సమాధానం కాదండోయ్, నిజంగా నిజం! ఎందుకంటే అచ్చం నల్ల కళ్లద్దాల్లా ఇక్కడ కనిపిస్తున్నది ఓ హెయిర్ క్లిప్. చూసేందుకు మాత్రం ఎవరైనా కళ్లజోడే అలా పెట్టుకున్నారనిపించేలా ఉంటుంది. ‘మినీ సన్ గ్లాసెస్ హెయిర్ క్లిప్’ పేరిట వస్తున్న వీటిలో విభిన్న రకాలు ఉంటున్నాయి.
రెండు అద్దాలనూ కలిపి అచ్చం కళ్ల జోడులా ఉన్న మోడల్‌కి వెనక వైపు క్లిప్ ఉండేది ఒకరకం అయితే, చెంప పిన్నుల్లాంటి రెంటిని జతచేస్తే కళ్లజోడులా కనిపించేది మరో రకం. మన అవసరాన్ని బట్టి ఎంచుకుంటే ఫ్యాషనబుల్ దుస్తుల మీదకి సరిపోయేలా అందంగా దీన్ని పెట్టుకోవచ్చు. చిన్న పిల్లలు పెట్టుకునేలా కళ్లజోడు తరహాలో రంగు రంగుల క్లిప్పులూ వస్తున్నాయి. మీకూ నచ్చాయా మరి!