ముంబై: మహారాష్ట్రలో రోడ్లపై, వీధుల్లో సాగే పండుగ ఊరేగింపుల్లో బాణసంచా, లేజర్ లైట్ల వినియోగంపై పూర్తిగా నిషేధం విధిస్తూ బాంబే హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. పండుగల వేళ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకొంది. అధిక తీవ్రత కాంతి లైట్లపై కూడా కోర్టు నిషేధం విధించింది. తమ ఆదేశాలు ఉల్లంఘనకు గురై నివాసితులకు హాని కలగడానికి ముందే అధికారులు తగిన నిరోధక చర్యలు తీసుకోవాలని చెప్తూ అవేమిటో స్పష్టంగా తెలిపింది.
ప్రజలు చనిపోవడం లేదా ఆరోగ్యపరంగా సతమతం కావడం పండుగ వేడుకల ఉద్దేశం కాదని ధర్మాసనం పేర్కొన్నది. వినాయక చవితి లాంటి పండుగల సందర్భంగా తనిఖీ చేయని కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. శబ్ద కాలుష్యం జరగకుండా వేడుకల నిర్వాహకులు అంతర్గత శబ్ద పరిమితి పరికరాలను అమర్చుకోవాలని తెలిపింది. శబ్ద పరిమితులను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే డిపాజిట్ మొత్తాన్ని జప్తు చేయాలని ఆదేశించింది.