కొత్తగూడెం అర్బన్, జూన్ 24 : కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధమైన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తగూడెం సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు జలీల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.జె.రమేశ్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జామలయ్య, టీయూసీఐ జిల్లా కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు సారంగపాణి, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు శంకర్ రెడ్డి మాట్లాడారు.
బ్రిటిష్ కాలంలోనే కార్మికులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి, కార్మిక భద్రతకి, సంక్షేమానికి అనేక పోరాటాలు చేసి కార్మిక చట్టాలను సాధించుకున్నట్లు తెలిపారు. కార్మిక చట్టాలని కరోనా కాలంలో మోదీ ప్రభుత్వం ముజువాణి ఓటుతో పార్లమెంట్ లో మార్పులు చేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందని దుయ్యబట్టారు. కార్పొరేట్ యాజమాన్యాలను సంతృప్తి పరచడానికి, వారి ఆదాయాలను మరింత రెట్టింపు చేయడానికి కార్మికవర్గం ముల్గలు పీల్చి పిప్పి చేయడానికి నాలుగు లేబర్ కోడ్ లను మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. ఇప్పటికే దేశంలోని బిజెపి పాలిత రాష్ట్రాలలో నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేస్తున్నారని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏడాది పాలన పూర్తైనా సందర్భంలో కార్మికులకు 8 గంటల పని స్థానంలో 10 గంటల పని దినాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు.
కాంగ్రెస్ పాలిత కర్ణాటక, రాజస్థాన్ లలో నాలుగు లేబర్ కోడ్ ల అమలుకు రంగం సిద్ధం చేశారని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, కార్మిక వర్గాన్ని తీవ్ర ఇబ్నదులకు గురి చేయడం తప్పా మరొకటి లేదని విమర్శించారు. కార్మిక చట్టాల పరిరక్షణ కోసం జులై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని జిల్లా వ్యాప్తంగా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు భూక్యా రమేశ్, నగేశ్, మల్లికార్జున్, కృష్ణ, బాలాజీ, కాలంగి హనుమాతరావు, శనగ రాంచందర్, ఎం.చంద్రశేఖర్, గిరి, మాధవరావు పాల్గొన్నారు.