కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 05 : సమాజంలో కులం, మతం, లింగభేదాల పేరుతో సాగుతున్న సామాజిక వివక్షత, అసమానతలపై కార్మికవర్గం, సీఐటీయూ కార్యకర్తలు పోరాటం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్సదర్శి బి.మధు అన్నారు. సీఐటీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు బిటి రణదీవె 35వ వర్ధంతి సభను సీఐటీయూ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో దళితులు.. ఆదివాసీలు.. బలహీనవర్గాలు.. మహిళలు.. పిల్లలపై హింస పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ హింస వెనక కులతత్వం, మతోన్మాదం ప్రధానమైన అంశాలుగా ఉన్నాయని వాటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం సామాజిక చైతన్యం కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
ఇటువంటి విచ్ఛిన్నకర చర్యలు సామాజిక అసమానతలు, విశాలమైన కార్మికుల ఐక్యతకు తీవ్ర ఆటంకం కలిగిస్తాయన్నారు. బీటీ రణదీవె, మహాత్మా పూలే, అంబేద్కర్, విమల రణదీవే వంటి మహనీయుల పోరాటం స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం, ఆర్థిక సాంస్కృతిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. వర్ధంతి సభ ప్రారంభానికి ముందు బీటీఆర్ చిత్రపటానికి సీఐటీయూ జిల్లా కోశాధికారి జి.పద్మ పూలమాలవేసి నివాళులర్పించారు. సభకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె. బ్రహ్మచారి అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి ఎ.జే రమేశ్, జిల్లా నాయకులు ఈసం వెంకటమ్మ, పిట్టల అర్జున్, గద్దల శ్రీను, దొడ్డ రవి, డి. వీరన్న, ఎస్సీ నబి, కె.సత్య, డి.ధనలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు రమేశ్, తాళ్లూరు కృష్ణ, సుల్తానా, మొగిలి హేమలత, గుర్రం రాములు, వివిధ రంగాల కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.