మంచిర్యాల, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సహా ఇతర బీఆర్ఎస్ నాయకులపై నమోదైన అక్రమ కేసులపై మంచిర్యాల జిల్లా కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. సుమన్‌ను నాలుగు రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌తోపాటు, బెయిల్ పిటిషన్ మంగళవారం బెంచ్ మీదికి వచ్చాయి. సుమన్ కస్టడీ పిటిషన్‌పై ఆయన తరఫు న్యాయవాదులు కౌంటర్ వేశారు. దానికి సంబంధించి కొన్ని వీడియోలతోపాటు పలు పత్రికల్లో వచ్చిన కథనాలను, సుప్రీం కోర్టు గైడ్ లైన్స్‌కు సంబంధించి మూడు రూలింగ్స్‌ను కోర్టుకు సమర్పించినట్టు వారు పేర్కొన్నారు.
సుప్రీం కోర్టు ఏం చెప్పింది? ఏ విషయంలో కస్టడీకి ఇవ్వచ్చు.. ఎందులో ఇవ్వద్దు అన్న అంశాలపై వాదనలు వినిపించినట్టు తెలిపారు. కౌంటర్ దాఖలు చేసేందుకు మరికొంత గడువు కావాలని పోలీసులు కోరారు. దీంతోపాటు బాల్క సుమన్ బెయిల్ పిటిషన్లోనూ గడువు కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు ఈ పిటిషన్లపై తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసిందని న్యాయవాదులు పేర్కొన్నారు. పోలీసులు కస్టడీ కోరి నాలుగు రోజులు అవుతున్నా, సుమన్ న్యాయవాదులు వేసిన పిటిషన్‌కు కౌంటర్ వేయడం జాప్యం చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుమన్‌ను ఎక్కువ రోజులు జైలులో ఉంచాలనే దురుద్దేశంతోనే పోలీసులు వాయిదాలు కోరుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు.