హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీకి పరిశ్రమల నుంచి స్పందన కరువైంది. హైదరాబాద్లో దశాబ్దాల క్రితం ఏర్పాటైన పారిశ్రామిక వాడలను ఔటర్ రింగ్ రోడ్డు వెలుపలకు తరలించేందుకు ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ(హిల్ట్)ని సర్కార్ సిద్ధం చేసింది. ఈ పాలసీ ద్వారా 21 పారిశ్రామిక వాడల్లోని 9,292 ఎకరాల భూములను బహుళ అవసరాల(మల్టీ పర్పస్ యూజ్) భూములుగా మార్చుకొనే చాన్స్ కల్పించగా దరఖాస్తులకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇందులో మొత్తం 2,800 పరిశ్రమలు ఉండగా జూన్ 30 నాటికి కేవలం 193 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇక వీటిలో 47 దరఖాస్తులకు మాత్రమే ఆమోదం లభించింది. 20 టీజీఐఐసీ పరిశీలన దశలో ఉండగా.. మరో 72 జోనల్ స్థాయిలోనే ఉన్నాయి. మిగతా 54 దరఖాస్తులను ధ్రువ పత్రాలు సరిగా లేవని అధికారులు తిరస్కరించారు. హిల్ట్ పాలసీకి దరఖాస్తుల ద్వారా రూ.1500 కోట్లు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావించగా.. రూ.150 కోట్లు మాత్రమే చేకూరడం గమనార్హం.
ఈ పాలసీని బీఆర్ఎస్ సహా ప్రతిపక్షాలు ముందు నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ రూ.లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరలేపిందని ఆరోపిస్తన్నాయి. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగి హిల్ట్ పాలసీ విధానాలను పారదర్శకంగా అమలు చేసేందుకు ఓ జీవోను హడావిడిగా తీసుకొచ్చింది. జూన్ 30వ తేదీ గడువుగా ప్రకటించగా, ఆశించిన స్పందన రాలేదు. దీంతో సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగింది. మరోసారి గడువు పెంచుతూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 31 వరకు మరోసారి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయించింది. 2026 జూన్ 5కు ముందు అమలులో ఉన్న ఎస్ఆర్వో రేట్లనే ఈ గడువు పొడిగింపు కాలంలో కూడా వర్తింపజేయాలని ఉత్తర్వుల్లో సూచించింది.
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ పాలసీని దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణంగా అభివర్ణించారు. ఓఆర్ఆర్ పరిధిలోని సుమారు 9,293 ఎకరాల విలువైన పారిశ్రామిక భూములపై కన్నేసి, రూ. 5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మధ్యవర్తులకు తకువ ధరకే కట్టబెట్టేందుకు ఈ విధానాన్ని తెచ్చారని మండిపడ్డారు. ప్రభుత్వ (ఎస్ ఆర్ వో) రేట్లలో కేవలం 30% మాత్రమే చెల్లించి భూములను క్రమబద్ధీకరించుకునే వెసులుబాటు కల్పించడం వెనుక భారీ ముడుపుల వ్యవహారం దాగి ఉందంటూ చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మరోవైపు ప్రభుత్వం విధించిన డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు భారీగా ఉండటం, విధివిధానాలపై ఇప్పటికీ స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం పరిశ్రమల వెనుకడుగుకు కారణంగా తెలుస్తున్నది. అంతేకాకుండా పరిశ్రమలను నగర పరిధి దాటిస్తే వేలాది మంది కార్మికుల ఉపాధి దెబ్బతింటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంలోని పరిశ్రమల శాఖకు పూర్తి సమాచారం ఇవ్వకుండానే ఈ నిర్ణయాలు తీసుకున్నారనే ప్రచారం కూడా పరిశ్రమల వెనుకడుగుకు కారణమైంది.