హైదరాబాద్, ఆగస్టు 8, (నమస్తే తెలంగాణ): హైడ్రా డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం వచ్చిన నిరుద్యోగ యువతను ఘోరంగా అవమానించిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, వెంటనే ఆ యువకులకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వేదికగా హైడ్రా పోస్టుల భర్తీ ప్రక్రియ సందర్భంగా అభ్యర్థులతో అధికారులు ప్రవర్తించిన తీరుపై శనివారం ఎక్స్ వేదికగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. హైడ్రాలో కేవలం 150 డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే, దరఖాస్తు చేసుకోవడానికి వేలాది మంది నిరుద్యోగులు క్యూ కట్టారని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులు రావడం నిరుద్యోగుల తప్పు కాదని, సరిపడా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వానిదే వైఫల్యమని ఎండగట్టారు.‘ఎన్నికల సమయంలో అధికారంలోకి రావడానికి విద్యార్థులు, నిరుద్యోగులను నెత్తిన పెట్టుకొని హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల కోసం రోడ్డుపైకి వస్తే వారి పట్ల ఇంత కరశంగా ప్రవర్తిస్తారా?’ అని సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు, విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతున్నదని విమర్శించారు.
ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’ అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారని, ఆ వ్యాఖ్యలనే ఆసరాగా చేసుకొన్న అధికారులు ఉద్యోగాల కోసం ఎంతో ఆశగా వచ్చిన యువతను దుర్భాషలాడారని హరీశ్‌రావు తెలిపారు. ఈ ఘటనతో ‘యథా రాజా.. తథా అధికారులు’ అనే సామెతను గుర్తుచేస్తున్నదని పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న అధికారులు నోటికొచ్చినట్టు మాట్లాడటం అత్యంత బాధాకరమని, వారిపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై శస్త్ర చికిత్స (ఆపరేషన్) చేయించుకొన్న బీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేశ్‌ను ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు శనివారం పరామర్శించారు. హైదరాబాద్‌లోని మల్లేశ్ స్వగృహానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన తీసుకుంటున్న వైద్యం, కోలుకుంటున్న తీరును తెలుసుకున్నారు. క్యామ మల్లేశ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని, తిరిగి ప్రజాక్షేత్రంలో చురుగ్గా పాల్గొనాలని వారు ఆకాంక్షించారు.
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చి 32 నెలలు గడిచినా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. 2 లక్షల ఉద్యోగాల హామీ, ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్, నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలన్నీ బోగస్‌గా మారాయని మండిపడ్డారు. మాట ఇచ్చిన విధంగా సకాలంలో ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే 150 చిన్న ఉద్యోగాల కోసం పీజీ, పీహెచ్‌డీలు, ఇంజినీరింగ్ పూర్తిచేసిన యువత గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. హకుగా రావాల్సిన ఉద్యోగాలను అడగడం, ప్రభుత్వాన్ని నిలదీయడం నేరం కాదని, ఇప్పటికైనా నిరుద్యోగుల ప్రభుత్వం అక్కున చేర్చుకోవాలని హితవు పలికారు.