హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రభుత్వ సమగ్ర రికార్డులు, నిధుల నిర్వహణ వ్యవస్థ(ఐఎఫ్ఎంఐఎస్)లో సంచలన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. పాఠశాల విద్య, పోలీస్, ప్రజారోగ్యం, రెవెన్యూ, వ్యవసాయం వంటి వివిధ శాఖల్లో ఒకే ఆధార్ నంబర్, రెండు వేర్వేరు ఉద్యోగ కోడ్లతో 40 మంది వరకు నెలవారీ రెండు జీతాలు తీసుకుంటున్నట్టు ప్రాథమిక పరిశీలనలో తేలింది. రెగ్యులర్ (010), గ్రాంట్-ఇన్-ఎయిడ్ (జీఐఏ), కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో దాదాపు 5,000 మంది డూప్లికేట్ ఆధార్ ప్రొఫైల్స్/మ్యాపింగ్‌లు ఉన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఒకే ఆధార్ కార్డుతో రెండు వేర్వేరు పేర్లు, వేర్వేరు బ్యాంక్ ఖాతాలకు లక్షల రూపాయలు వేతనాలుగా మళ్లించినట్టు గుర్తించారు.
ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లోని డాటాను లోతుగా స్రూటినీ చేయగా, తీవ్రమైన అక్రమాలు చోటుచేసుకున్నట్టు తేలింది. ఆలస్యంగా గుర్తించిన రాష్ట్ర సర్కార్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. తప్పుడు సమాచారం ఇచ్చి మోసపూరితంగా సొమ్ము డ్రా చేసిన ఉద్యోగులపై ఐపీసీ/సీఆర్పీసీ నిబంధనల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయడం, ఉద్యోగాల నుంచి తొలగించడం/సస్పెన్షన్, డ్రా చేసిన మొత్తం నిధులను వడ్డీతోసహా రికవరీ చేయడానికి తాజాగా సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమాలకు సహకరించిన డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ల(డీడీవో) పై కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. వారం రోజుల్లోగా విచారణ పూర్తి చేసి యాక్షన్ టేకెన్ రిపోర్టు (ఏటీఆర్) సమర్పించాలని పంచాయతీరాజ్, మున్సిపల్, విద్య, పోలీస్, రెవెన్యూ, ప్రజారోగ్య శాఖల కార్యదర్శులను చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు ఆదేశించారు.
ఐఎఫ్ఎంఐఎస్ డాటాలో బయటపడిన ప్రతి డూప్లికేట్ ఒకే రకమైన అక్రమమని తేల్చేయడానికి వీల్లేదు. కొన్ని కేసుల్లో పేర్లు వేరు, ఆధార్ వేరుగా ఉన్నా ఒకే హెచ్‌వోడీ, ఒకే హోదా వంటి అంశాలు కనిపిస్తున్నాయి. మరికొన్ని కేసుల్లో పేర్లు ఒకేలా ఉండి ఆధార్ నంబర్లు వేరుగా ఉన్నాయి. మరో కేసులో రెవెన్యూశాఖలో ఒక ఆధార్ నంబర్ గుర్తించగా, డీజీపీ విభాగంలో అదే పేరుతో మరో ఎంట్రీ ఆధార్ లేకుండా నమోదు చేశారు. డాటా ఎంట్రీ పొరపాటు, పాత సర్వీస్ రికార్డు, బదిలీ తర్వాత వివరాలు అప్డేట్ కాకపోవడం వంటి అంశాలనూ విచారణలో తేల్చాల్సి ఉంటుంది. అందుకే ఆర్థికశాఖ ప్రతి కేసుపై సమగ్ర విచారణకు ఆదేశించింది.
ఆర్థికశాఖ సర్యులర్కు జత చేసిన పట్టికలో 40 వరకు కేసులు ఉన్నాయి. ఈ 40 కేసులు ఐఎఫ్ఎంఐఎస్ డాటా నుంచి ఇప్పటివరకు గుర్తించిన కేసులా? లేక పూర్తిస్థాయి పరిశీలనలో భాగంగా తేలిన మొత్తం కేసులా? అనే విషయంలో స్పష్టత లేదు. సర్యులర్ మాత్రం సంబంధిత శాఖలు కేసులపై వెంటనే సమగ్ర విచారణ చేయాలని చెప్తున్నది. అందువల్ల 40 కేసులే అంతిమ సంఖ్య అని ఇప్పుడే చెప్పడానికి వీలు లేదు. ఇదిలా ఉండగా, రెగ్యులర్, ఔట్సోర్సింగ్ తదితర ఉద్యోగుల వివరాల్లో సుమారు 5 వేల వరకు డూప్లికేట్ ఎంట్రీలు ఉన్నట్టు అధికార వర్గాల్లో చర్చ నడుస్తున్నది. అన్ని శాఖల్లో ఉద్యోగుల ఆధార్, సర్వీస్ రికార్డులు, ఉద్యోగ కోడ్లు, బ్యాంకు ఖాతాలు, వేతన బిల్లులు, నియామక వివరాలను క్రాస్ వెరిఫై చేస్తే మరిన్ని అనుమానాస్పద ఎంట్రీలు బయటపడే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఒక ఉద్యోగి ఒకే సమయంలో రెండుచోట్ల పనిచేస్తున్నట్టు రికార్డులు చూపుతున్న కేసుల్లో నియామక ఉత్తర్వులు, రిలీవింగ్ /జాయినింగ్ తేదీలు, బదిలీ వివరాలు, సర్వీస్ రిజిస్టర్, పే బిల్లులు, బ్యాంకు చెల్లింపులు అన్నింటినీ సరిపోల్చాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇది డాటా పొరపాటా? లేక ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించిన అక్రమమా? అనేది స్పష్టమవుతుంది.
రెగ్యులర్, గ్రాంట్ -ఇన్-ఎయిడ్, తాతాలిక ఉద్యోగులు, ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, ఇతర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే సిబ్బంది వివరాలను ఐఎఫ్ఎంఐఎస్ ద్వారా ధ్రువీకరించాలని ఈ నెల ఆగస్టు 6న ఆర్థికశాఖ సర్యులర్ జారీ చేసింది. ఈ ప్రక్రియలో ఒకే ఆధార్ నంబర్‌కు ఇద్దరు, ముగ్గురు ఉద్యోగులు లింకు అయి ఉన్నట్టు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో అదే ఆధార్‌పై ఒకటి కంటే ఎకువ ప్రభుత్వ సంస్థల నుంచి జీతం లేదా పారితోషికం డ్రా అయినట్టు పరిశీలనలో తేలింది. ఇది కేవలం ఒకేశాఖలో జరిగిన డాటా పొరపాటు కాదు. డీజీపీ, ప్రజారోగ్యం, రెవెన్యూ, పాఠశాల విద్య, వ్యవసాయం, నీటిపారుదల, పంచాయతీరాజ్, ఉన్నత విద్య తదితర శాఖలకు చెందిన ఉద్యోగుల పేర్లు కనిపిస్తున్నాయి. కొన్ని కేసుల్లో ఒకే ఆధార్ నంబర్‌తో ఇద్దరు ఉద్యోగులు పూర్తిగా వేర్వేరు శాఖల్లో పనిచేస్తున్నట్టుగా డాటా ఉన్నది. డీజీపీ-రెవెన్యూ, డీజీపీ-సూల్ ఎడ్యుకేషన్, రెవెన్యూ-పంచాయతీరాజ్ వంటి విభిన్న కాంబినేషన్లు ఉన్నాయి. ఇంకొన్ని కేసుల్లో ఒక ఉద్యోగి రెగ్యులర్ కాగా, మరొకరు ఇతర క్యాటగిరీలో ఉన్నట్టు కూడా నమోదైంది. రెగ్యులర్ ఉద్యోగి, మరో ఉద్యోగి పేరిట ఒకే ఆధార్ మ్యాపింగ్ ఉండి.. ఇద్దరికీ జీతాలు చెల్లించినట్టు తాజాగా ఆర్థిక విడుదల చేసిన వివరాల్లో వెల్లడైంది.