హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రైతుకూలీలను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసగిస్తున్నది. ఇందుకు ఆత్మీయ భరోసా పథకం అమలు తీరే నిదర్శనం. ఈ పథకం కింద సాగుభూమిలేని నిరుపేద రైతుకూలీలకు ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తామంటూ ఊదరగొట్టి నిరుడు బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయించిన రేవంత్‌రెడ్డి సర్కార్.. 5 లక్షల మంది లబ్ధిదారులకు రెండు విడుతల్లో రూ.6 వేల చొప్పున అందజేస్తామని అసెంబ్లీ సాక్షిగా గొప్పలు చెప్పింది.
కానీ, ఆచరణలో కేవలం 83,420 మందికే స్వల్ప ప్రయోజనం చేకూర్చింది. తొలి విడుతలో రూ.6 వేల చొప్పున వారి ఖాతాల్లో జమచేసి చేతులు దులుపుకొన్నది. రెండో విడుత కింద రూ.261 కోట్లు విడుదల చేస్తున్నట్టు మీడియాకు లీకులు ఇచ్చినప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా కనీసం ఒక్కరికి కూడా ఆర్థిక సాయం అందజేయకపోవడం కాంగ్రెస్ సర్కార్ చిత్తశుద్ధిలేమికి అద్ధం పడుతున్నది.
కొర్రీలతో లబ్ధిదారుల కుదింపు
అధికారంలోకి వచ్చిన వెంటనే 22 లక్షల మంది భూమిలేని రైతుకూలీలకు ఆత్మీయ భరోసా కింద లబ్ధి చేకూరుస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెప్పిన రేవంత్‌రెడ్డి.. తీరా గద్దె ఎక్కిన తర్వాత అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఆ పథకంలో కొర్రీలు పెడుతూ లబ్ధిదారుల సంఖ్యను కుదిస్తున్నారు. ఉపాధి హామీ జాబ్‌కార్డులు కలిగిన 55 లక్షల మంది కూలీల్లో ఎకరం కంటే తక్కువ భూమి ఉన్నవారిని, అసలు భూమే లేనివారిని కలిపి మొత్తం దాదాపు 20 లక్షల మందిని గుర్తించామని చెప్పిన అధికారులు.. 2024లో 20 రోజులు పనిచేసిన కూలీలే ‘ఆత్మీయ భరోసా’కు అర్హులంటూ లబ్ధిదారులను 5,19,191 మందికి తగ్గించారు.
రైతుకూలీల ఆగ్రహం
ఇదేంటని అడిగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, అప్పుల భారం పెరిగిపోయిందని ప్రభుత్వ పెద్దలు చేతులెత్తేస్తున్నారని రైతుకూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండానే ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారా? అమలు చేతగాకుంటే బడ్జెట్లో వందల కోట్ల రూపాయలు కేటాయించడం ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. తమకు ఏటా రూ.12 వేల చొప్పున అందజేస్తామని ఆశచూపి మోసగించారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేస్తారా? లేదా? అనే అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.