ముఖ్యనేత ఇటీవల అమెరికాలో పర్యటించాలని భావించగా, కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన సంగతి తెలుసుకదా. హోదా, ఉద్దేశానికి తగినట్టు ఆ కార్యక్రమాలు లేవని కేంద్రం స్పష్టంచేసిందనీ తెలుసు కదా. ‘అనుచిత’ (ఇన్ అప్రాప్రియేట్) అనే పదమూ వాడింది కదా. దీంతో లండన్ నుంచి మధ్యలోనే తిరిగి వచ్చిన ముఖ్యనేత.. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటించాలనుకొంటే, కేంద్రం అడ్డుపుల్ల వేసిందని చిందులేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని నిప్పులు చెరిగారు.
అంత జరిగినా కేంద్రం.. ఆ ఆరోపణలను ఖండించలేదు. ఆ పర్యటనకు సంబంధించి తాము గుర్తించిన అనుచితమేమిటో వెల్లడించలేదు. మళ్లీ ఆ విషయంపై మాట్లాడలేదు. దీన్నిబట్టే ఆ పర్యటన ఉద్దేశాలు ఎంతటి సున్నితమైనవో, ఎంత
సీరియస్ అంశాలో అర్థంచేసుకోవచ్చు.
గతేడాది ఆగస్టులో ముఖ్యనేత, ఆయన బృందం అమెరికాలో పర్యటించారు. న్యూయార్క్, వాషింగ్టన్, కాలిఫోర్నియా తదితర రాష్ర్టాలు తిరిగారు. పెట్టుబడుల కోసమంటూ 50కి పైగా బిజినెస్ మీటింగ్స్ నిర్వహించారు. మరి, అప్పటి అమెరికా పర్యటనను కేంద్రం ఎందుకు అడ్డుకోలేదు? ఇప్పుడే ఎందుకు నిరాకరించినట్టు??
మీకు వచ్చినట్టే ‘నమస్తే తెలంగాణ’కూ ఇదే సందేహం వచ్చింది. దీంతో వారంరోజులపాటు లోతైన పరిశోధన జరిపింది. ఈ క్రమంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. ముఖ్యనేత అమెరికా పర్యటన రాష్ర్టానికి పెట్టుబడులు తీసుకురావడం కోసం కాదని, బిగ్‌బ్రదర్స్ బోగస్ కంపెనీలకు ఒప్పందాలు కుదుర్చుకోవడానికేనని చివరికి తేలింది.
ముఖ్యనేత.. బిగ్‌బ్రదర్..
బిగ్‌బ్రదర్ కొడుకు..
ఓ న్యూయార్క్ ప్రముఖుడు
ఓ అమెరికన్ పారిశ్రామికవేత్త
ఎవరు వీళ్లంతా..
టెస్సెరాక్ట్.. రెడ్లర్..
ఓ ఇంటర్నేషనల్ డిఫెన్స్ కంపెనీ..
మరో స్ట్రాటజిక్ ఫోరమ్
ఏందీ కత….
పటాన్చెరు.. జీడిమెట్ల.. రావిర్యాల.. దావోస్.. ఇజ్రాయెల్.. అమెరికా..
ఏమిటీ లింకు?
అర్థమవట్లేదా? అయోమయంగా ఉన్నదా?
సంబంధం లేకుండా రాశామనుకుంటున్నారా?
కాస్త ఆగండి. కథనం చదవండి..
ఒక్కొక్కటిగా చిక్కుముడి వీడుతుంది..!

టెస్సెరాక్ట్‌తో కథ మొదలు
టెస్సెరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఓ కంపెనీ ఉంది. 2023 ఏప్రిల్ 11న పటాన్చెరులో లక్ష రూపాయల పెయిడ్అప్ క్యాపిటల్‌తో ప్రారంభమైంది. ఏవియేషన్, ఏరోస్పేస్ రంగానికి అవసరమైన విడి భాగాలను తయారు చేస్తామంటూ కంపెనీ తన వెబ్సైట్లో చెప్పుకొన్నది.
అయితే, ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్టుగా ఏవియేషన్ పరికరాల తయారీ అంటూ ఆర్భాటాలకు పోతున్న ఈ కంపెనీ.. పటాన్చెరులో ఓ ఇంట్లో, జీడిమెట్లలో మరో చిన్న గోదాంలో కార్యకలాపాలు సాగిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పైగా రికార్డుల ప్రకారం ఒక్క ఉద్యోగి కూడా లేని ఈ కంపెనీ ఏవియేషన్, ఏరోస్పేస్ ప్రాజెక్టులను ఎలా పూర్తి చేస్తుంది? అంటూ అందరూ అనుమానాలు వ్యక్తంచేశారు.

రావిర్యాలలో 210 కోట్ల భూమాయ
ఇలాంటి ట్రాక్ రికార్డ్ కలిగిన టెస్సెరాక్ట్ కంపెనీకి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామంలో రూ. 210 కోట్ల విలువైన ఐదెకరాల భూమిని అత్యంత చవగ్గా అంటే రూ. 7 కోట్లకే తెలంగాణ ప్రభుత్వం కట్టబెట్టింది.
2025 జూన్ 12వ తేదీన ఈ కేటాయింపులు జరిగాయి. అంతేకాదు, టెస్సెరాక్ట్కు భూసంతర్పణ చేయడానికి ప్రభుత్వం రావిర్యాల రైతుల మీదికి బుల్డోజర్లను కూడా పంపింది. 2025 జూన్ 11వ తేదీన అంటే టెస్సెరాక్ట్కు భూ కేటాయింపులు జరుగడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు రైతులపై దమనకాండ జరిగింది.

టెస్సెరాక్ట్‌పై ఎందుకంత ప్రేమంటే?
ఊరూపేరూ లేని ఓ కంపెనీకి ప్రభుత్వం విలువైన భూములను అత్యంత చవకగా ఎందుకు కట్టబెట్టింది? దీని కోసం ఏకంగా
రైతుల మీదికే బుల్డోజర్లను ఎందుకు పంపాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు ఆరునెలల కిందటి వరకూ ఎవరి దగ్గరా సమాధానం
లేదు. అయితే, ఇప్పుడు ఆ అస్పష్టత మెల్లిమెల్లిగా వీడుతున్నది. అసలు దృశ్యం అవగతమవుతున్నది. గత మార్చిలో టెస్సెరాక్ట్ కంపెనీ మేనేజ్మెంట్లో సమూల మార్పులు జరిగాయి.
ముఖ్యనేత సోదరుడు, బిగ్బ్రదర్స్లో ఒకరు.. టెస్సెరాక్ట్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన కుమారుడు సీఈవోగా నియమితులయ్యారు. కాబట్టి రావిర్యాలలోని రూ. 210 కోట్ల విలువైన భూములను అత్యంత చవగ్గా రూ.7 కోట్లకే టెస్సెరాక్ట్కు సర్కార్ ఎందుకు కట్టబెట్టిందో ఇప్పుడు అర్థమైందా? కథ ఇక్కడితో ముగియలేదు. అసలు మలుపులు ఇకపైనే బయటపడబోతున్నయ్..

దావోస్‌లో బీజం పడిందిలా..
మీకు గుర్తుందా? ఈ ఏడాది జనవరిలో ముఖ్యనేత, ఆయన బృందం దావోస్‌లో పర్యటించారు. వివిధ దేశాల ప్రతినిధులతోపాటు ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీకి చెందిన కీలక అధికారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటూ అభ్యర్థించారు. ఈ మేరకు సీఎంవో కూడా ప్రత్యేకంగా ప్రెస్‌రిలీజ్ ఇచ్చింది. అయితే, ఎనిమిది నెలలు గడిచినా ఏ ఒక్క ఇజ్రాయెల్ కంపెనీ అయినా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినట్టు వార్తలు వచ్చాయా? లేదు కదూ.
అయితే, ఇజ్రాయెల్ ప్రతినిధులతో జరిగిన భేటీ ఫలాలు మాత్రం ముఖ్యనేతకు దక్కాయట. అవేమిటో తెలుసా?? బిగ్ బ్రదర్‌కు చెందిన టెస్సెరాక్ట్ కంపెనీతో ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ కంపెనీ రెడ్లర్ జట్టు కట్టింది. ముఖ్యనేత దావోస్ పర్యటన ముగించుకొని రాష్ర్టానికి చేరుకోగానే ఈ ప్రక్రియ అంతా చకచకా జరిగిపోయింది. ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ ప్రతినిధితో ముఖ్యనేత భేటీ అయితే, ఆ కంపెనీ టెస్సెరాక్ట్‌తో ఎందుకు ఒప్పందం చేసుకొన్నది? ఇక్కడ మరో ట్విస్ట్ ఉన్నది.
ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీకి ప్రధానంగా నిధులు సమకూరుస్తున్నది ఆ కంపెనీనే. కాబట్టి ఆ ప్రతినిధి సిఫార్సులతో సదరు కంపెనీ-టెస్సెరాక్ట్ మధ్య ఒప్పందం కుదిరినట్టు సమాచారం. ఒప్పందాన్ని ఆ కంపెనీ ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. అవి రెండూ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేశాయని, దానికి కూడా తానే చైర్మన్‌గా వ్యవహరిస్తున్నానని
బిగ్‌బ్రదర్ తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో పేర్కొనడం గమనార్హం.

ఇజ్రాయెల్ నుంచి అమెరికాకు..
రెడ్లర్తో ఒప్పందం పూర్తి చేసుకొన్న టెస్సెరాక్ట్ కంపెనీ అడుగులు అమెరికా వైపునకు మళ్లాయి. దీని కోసం ముఖ్యనేత మళ్లీ రంగంలోకి దిగారు. ఆ సంస్థకు ఉత్తర అమెరికా, న్యూయార్క్‌లో ప్రధానంగా క్లయింట్లు ఉన్నట్టు ముఖ్యనేత, బిగ్ బ్రదర్స్ తెలుసుకున్నారు. ఆ వివరాలను సేకరించారు. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ కంపెనీ గురించీ తెలుసుకొన్నారు. రెడ్లర్తో ఈ కంపెనీ అప్పటికే జట్టుకట్టింది.
ఇదే సమయంలో డిఫెన్స్, ఏరోస్పేస్ రంగంలో కీలకంగా ఉన్న మరో కీలక కంపెనీతో టెస్సెరాక్ట్కు ఓ డీల్ కుదర్చాలని ముఖ్యనేత భావించినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే అమెరికాలోని సదరు డిఫెన్స్ కంపెనీ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం కావడానికి ముఖ్యనేత అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్టు సమాచారం. వాస్తవానికి హైదరాబాద్ శివారులోని ఆదిభట్లలో ఆ కంపెనీ ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్నది. అమెరికా పర్యటన కంటే ముందే ఈ ఏడాది ఏప్రిల్ 8న ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ముఖ్యనేతతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

న్యూయార్క్ సిటీ మేయర్ జొహ్రాన్ మమ్దానీతోపాటు, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో సమావేశం కావడానికి ముఖ్యనేత ప్రయత్నించారని, ఆ సమాచారం ముందుగా తెలియజేయకపోవడం వల్లే ఆయన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిందని వార్తలు వచ్చాయి. అయితే, వాన్స్‌తో భేటీని వదంతిగా కొట్టిపారేసిన ముఖ్యనేత.. మమ్దానీని కలిస్తే తప్పేందని మీడియా ముందే ప్రశ్నించారు. దీంతో ‘న్యూయార్క్ మేయర్‌ను వ్యక్తిని ముఖ్యనేత కలువాల్సిన అవసరమేంది?’ అనే ప్రశ్న మొదలైంది.
మధ్యలో మరో కహానీ
దీనిపై లోతుగా పరిశోధన చేయగా మరిన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి. న్యూయార్క్‌లోని ఓ కీలక ప్రజాప్రతినిధి మద్దతుదారుల్లో కొంతమందికి ఇజ్రాయెల్ ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలతో సత్సంబంధాలున్నట్టు తెలిసింది. పైగా అందులో ముఖ్యనేత బిజినెస్ కోసం ప్రయత్నిస్తున్న రెండు కంపెనీలూ ఉన్నాయి. యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరమ్ (యూఎస్ఐఎస్పీఎఫ్) అనే ప్రైవేట్ సంస్థ ఒకటి ఉంది.
టెస్సెరాక్ట్ కంపెనీ పేరుచెప్పుకొనే బిగ్‌బ్రదర్ ఈ యూఎస్‌ఐఎస్‌పీఎఫ్‌కు చెందిన ఇండియా ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ బోర్డులో తాత్కాలిక సభ్యుడిగా చేరారు. అయితే యూఎస్ఐఎస్పీఎఫ్ బోర్డులో శాశ్వత సభ్యుడిగా కొనసాగడానికి బిగ్‌బ్రదర్ చేయని ప్రయత్నాలు లేవు. ఈ క్రమంలోనే ఈ మూడు వ్యవహారాలను చక్కబెట్టడానికే ముఖ్యనేత న్యూయార్క్‌లోని ఓ ప్రజాప్రతినిధితో భేటీకి తహతహలాడిపోయారని తెలిసింది. అయితే, ఈ సమాచారం తెలుసుకొన్న కేంద్రం.. హోదాకు తగిన కార్యక్రమం కాదంటూ పర్యటనను నిరాకరించింది.

ముఖ్యనేత అమెరికా పర్యటన ఉద్దేశం రాష్ర్టానికి పెట్టుబడులు తీసుకురావడం కాదనేది తేలిపోయింది. బిగ్‌బ్రదర్ బోగస్ కంపెనీకి డీల్స్ కుదుర్చుకోవడానికే ముఖ్యనేత ఈ పర్యటన పెట్టుకొన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బోగస్ కంపెనీకి డీల్స్‌ను సులభంగా పూర్తిచేయడంతోపాటు యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరమ్‌లో తన సోదరుడికి శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న లక్ష్యంతో న్యూయార్క్ ప్రజాప్రతినిధితో భేటీకి తహతహలాడిపోయారు. అంటే ముఖ్యనేత పర్యటన పూర్తిగా ప్రైవేట్ వ్యవహారం. కానీ, అధికారిక కార్యక్రమంగా, తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాకు వెళ్తున్నట్టు ఆయన కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది గుర్తించిన కేంద్రం.. ‘అనుచిత’ సమావేశాల పేరిట ముఖ్యనేత అమెరికా పర్యటనను నిరాకరించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

బోగస్ కంపెనీని సృష్టించి దాని ద్వారా రెండు ప్రధాన ప్రయోజనాలు పొందాలని ముఖ్యనేత, బిగ్‌బ్రదర్ ప్లాన్ వేసినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటిది కంపెనీని అడ్డం పెట్టుకొని రూ.వందల కోట్ల విలువైన భూములను కొట్టేయడం.
రెండోది.. అంతర్జాతీయ డీల్స్‌ను చూపెడుతూ షెల్ కంపెనీకి ప్రభుత్వం ద్వారా భారీ సబ్సిడీలు మంజూరు చేయించుకోవడం. తానొక ప్రభావశీల పారిశ్రామికవేత్త అనే భ్రమలో బిగ్‌బ్రదర్ ఉన్నారు. దీన్ని నిజం చేయడానికి ముఖ్యనేత తహతహలాడిపోయారు. యూఎస్-ఇండియా ఫోరమ్‌లో బిగ్బ్రదర్ను పర్మనెంట్ మెంబర్‌గా చేర్పించాలని తీవ్రంగా ప్రయత్నించారు. చివరకు కథ అడ్డం తిరిగింది.

టెస్సెరాక్ట్ కంపెనీపై అనుమానాలు వ్యక్తంచేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగస్టు 11న మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ‘2025 మార్చి 31న టెస్సెరాక్ట్ ఇచ్చిన నివేదిక ప్రకారం కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా లేరు. ఫోన్ నంబర్ చూస్తే 123456789 అని ఉంది.
ఇలాంటి నంబర్లు ఉంటాయా? పటాన్చెరులో ఒక చిరునామాను కార్యాలయంగా చూపించారు. ఈ కంపెనీలో ఏరోస్పేస్, డిఫెన్స్ పరికరాలు తయారు చేస్తారట. ఇలాంటి షెల్ కంపెనీకి రావిర్యాలలో రూ. 200 కోట్ల విలువైన భూమి ఎలా కట్టబెట్టారు?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. అలా కేటీఆర్ ప్రెస్‌మీట్ పూర్తయ్యిందో లేదో ఇటు టెస్సెరాక్ట్ సైట్లో ఆగమేఘాలపై మార్పులు చోటుచేసుకున్నాయి. కంపెనీ సేవలు డిఫెన్స్, ఏరోస్పేస్ నుంచి అసెంబ్లీ, ఇంటిగ్రేషన్, అవుట్సోర్సింగ్గా మారిపోయాయి. ఫోన్ నంబర్‌ను కూడా 8106107124గా మార్చేశారు.

అమెరికా కంపెనీలతో బిగ్‌బ్రదర్ కంపెనీకి ఒప్పందాలు కుదుర్చుకోవడానికి పాతబస్తీకి చెందిన ఓ వివాదాస్పద జర్నలిస్టు మధ్యవర్తిగా వ్యవహరించినట్టు వార్తలు వస్తున్నాయి. వక్ఫ్‌భూములపై ఇన్వెస్టిగేటివ్ కథనాలు రాసిన ఆయనపై అనేక ఆరోపణలున్నాయి. క్రిమినల్ కేసులూ నమోదయ్యాయి. ఐఎస్ఐతో సత్సంబంధాలు నెరిపారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆయన పాస్‌పోర్ట్‌ను కేంద్రప్రభుత్వం గతంలోనే రద్దుచేసింది. ప్రస్తుతం యూట్యూబర్‌గా ఆయన కొనసాగుతున్నారు.
పూర్వాశ్రమంలో పలు ఉర్దూ పత్రికల్లో పనిచేసిన ఆయన.. ముఖ్యనేతకు షాడోగా వ్యవహరించే ఓ కార్పొరేషన్ చైర్మన్‌కు ఆయన అత్యంత సన్నిహితుడిగా మారారు. వారిద్దరూ కలిసి భూదందాలు చేస్తుంటారన్న ఆరోపణలున్నాయి. షాడో నేత, ముఖ్యనేత అండదండలు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆయనకు జర్నలిజంలో అత్యుత్తమ అవార్డును ఏర్పాటు చేసి మరీ ఇచ్చారు. జర్నలిజంతో సంబంధంలేని, క్రిమినల్ కేసులున్న వ్యక్తికి అవార్డు ఇవ్వడమూ వివాదాస్పదమైంది.
పాతబస్తీతోపాటు రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో తనకంటూ ప్రత్యేక నెట్‌వర్క్‌ను ఈ జర్నలిస్టు ఏర్పాటు చేసుకొన్నారట. తన నెట్వర్క్ సాయంతో మసీదు కమిటీల ద్వారా ఎన్నికల సందర్భంగా ముఖ్యనేత తరఫున ప్రచారాలు చేయించారని సమాచారం. అయితే, ఈయన ఎప్పుడూ ఓపెన్‌గా ముఖ్యనేతను కలువరు. ఆయన తరఫున పనులను మాత్రం చక్కబెడుతుంటారు. ముఖ్యనేత అమెరికా పర్యటనలో ఈ జర్నలిస్టు ప్రమేయం కూడా ఉండటంతో నిఘావర్గాలు కేంద్రాన్ని అప్రమత్తం చేసినట్టు తెలిసింది. దీంతో అమెరికా పర్యటనకు కేంద్రం అభ్యంతరం చెప్పడానికి ఇదీ ఒక కారణమని సమాచారం.