మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ సంకటపరిస్థితిలో చిక్కుకున్నారు. అన్ని ఆరోపణల తర్వాతా, అంత జరిగినంకా మంత్రిపై చర్యలు తీసుకోలేకపోతే.. ‘అసమర్థత’ ముద్ర పడే ప్రమాదం! వేటు వేయాలంటే కాంగ్రెస్ నాయకత్వాన్ని ఒప్పించాల్సిన అనివార్యత! ఆయనకు ఇది పరువు-ప్రతిష్టలకు సంబంధించిన అంశంగా మారింది. ఇప్పటికే ఆలస్యమైందని భావిస్తున్న రేవంత్.. సురేఖపై చర్యలే లక్ష్యంగా ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేయాలని నిశ్చయించుకున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణా చర్యల వ్యవహారం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరువు ప్రతిష్టలతో ముడిపడిన జీవన్మరణ సమస్యగా రూపాంతరం చెందినట్టు తెలంగాణ ప్రజ లు భావిస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఆమెను మంత్రివర్గం నుంచి తక్షణం తప్పించకపోతే ‘అసమర్థత’ ము ద్రపడే ప్రమాదం ఉన్నదని సీఎం శిబిరం తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు సమాచారం. మరోవైపు, సీఎం రేవంత్‌రెడ్డ్డి ఎంత ఒత్తిడి తెస్తున్నా, అధిష్ఠానం మాత్రం కొండా విషయంలో అనుకున్నంత వేగంగా స్పందించడం లేదని, వేచి చేసే ధోరణితోనే ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో తన రాజకీయ అస్తిత్వానికి సవాల్‌గా నిలిచిన ఈ వ్యవహారంపై సానుకూల ఫలితాలను రాబట్టడం కోసమే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తున్నారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సెప్టెంబర్ 2న విదేశాల నుంచి ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఆయనను ఎలాగైనా ఒ ప్పించి, కొండాపై వేటు వేయించాలనే ఏకై క లక్ష్యంతో సెప్టెంబర్ 3న సీఎం రేవంత్‌రెడ్డి హస్తిన టూర్ పెట్టుకున్నారని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి.
ఇటీవల కొండా సురేఖ కుమార్తె సుస్మితాపటేల్ చేసిన సంచలన వ్యాఖ్యలు సీఎం శిబిరాన్ని తీవ్రంగా కుదిపేశాయి. 17 మంది ఎమ్మెల్యేలతో అత్యవసర మీడియా సమావేశం ఏర్పాటు చేయించి, సురేఖను మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని బహిరంగంగా డిమాండ్ చేయించారు. వేముల వీరేశం వంటి నేతలను రంగంలోకి దించి కొండా వర్గంపై సీఎం శిబిరం పెద్ద యుద్ధమే ప్రకటించింది. ఈ రచ్చ పీక్స్‌కు చేరడంతో మల్లు రవి నేతృత్వంలోని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది.
సురేఖ నుంచి రెండుసార్లు వివరణ తీసుకొని, నివేదికను తయారుచేసి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ద్వారా ఏఐసీసీకి పంపించింది. మంత్రి పదవి నుంచి సురేఖను తొలగించడంతోపాటు కనీసం ఆరు నెలలపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఇదే తరహా చర్యలను సీనియర్ నేత జీ చిన్నారెడ్డిపై కూడా తీసుకోవాలని ఆ కమిటీ సిఫార్సు చేసినట్టు లీకులు ఇచ్చారు. తుది నిర్ణయం పూర్తిగా అధిష్ఠానం చేతుల్లోనే ఉన్నదని, హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని పీసీసీ అధ్యక్షుడు పైకి చెప్తుండగా, అధిష్ఠానం మాత్రం ఈ నివేదికను కనీసం పట్టించుకోకపోవడం సీఎంకు మింగుడుపడటం చర్చ జరుగుతున్నది.
కొండాపై వేటు లక్ష్యంగా ఢిల్లీకి..
బహిరంగంగా మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ అంతర్గత విషయాలపై తాను మాట్లాడనని, క్రమశిక్షణ కమిటీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని చెప్తున్నప్పటికీ, తెరవెనుక మాత్రం సురేఖను మంత్రివర్గం నుంచి గెంటేయాలని ఢిల్లీపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఆ కోపంతోనే సురేఖ శాఖలో పనిచేస్తున్న ముఖ్యమైన ప్రత్యేకాధికారులను ఇప్పటికే ఏకపక్షంగా మార్చేసి ఆమెను నిస్సహాయురాలిని చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని, ఇది కొండా సురేఖపై సీఎం రేవంత్‌కు ఉన్న వ్యక్తిగత కక్షసాధింపు వైఖరికి నిదర్శనమని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు.
తాజాగా పార్టీ ముఖ్యనేతతోపాటు, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు చెందిన ఇద్దరు సీనియర్ మంత్రులను వెంటబెట్టుకొని ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలిసింది. గతంలో ఉప్పు-నిప్పుగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తాజాగా ఒక గ్రూపుగా ఏర్పడ్డారని, గతంలో సీఎంతో సన్నిహితంగా మెదిలిన పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఆయనతో విభేదించి సీనియర్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిసి ఒక వర్గంగా కొనసాగుతున్నారని కాంగ్రెస్ వర్గాల్లోనే బహిరంగ చర్చ జరుగుతున్నది.
వీళ్లందరినీ నయానా భయానా ఒప్పించిన సీఎం రేవంత్‌రెడ్డి ఈ ముగ్గురు నేతలను తీసుకొనే సెప్టెంబర్ 3న ఢిల్లీ వెళ్తున్నారని సీఎం అనుకూల శిబిరం మీడియాకు లీకులు ఇస్తున్నది. కేసీ వేణుగోపాల్ ఎదుట ఈ ముగ్గురు నేతలను హాజరుపరిచి వారితోనే కొండా సురేఖపై ఫిర్యాదులు చేయించాలని భావిస్తున్నట్టు తెలిసింది. పార్టీ అధ్యక్షుడితోపాటు కీలక మంత్రులే కొండాకు వ్యతిరేకంగా ఉన్నారని నిరూపించి, ఎలాగైనా ఆమెపై వేటు వేయించడమే ఈ ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న అసలు లక్ష్యమని చర్చ జరుగుతున్నది.
అధిష్ఠానం ఆచితూచి అడుగులు
సీఎం ఎంత ఒత్తిడి చేస్తున్నా, అధిష్ఠానం మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నదని, సురేఖ బీసీ వర్గానికి చెందిన బలమైన సీనియర్ నాయకురాలు కావడం, రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా బీసీ కార్డు వాడుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఉన్న బీసీ మహిళా మంత్రిపై వేటు వేస్తే జరిగే నష్టాన్ని అధిష్ఠానం అంచనా వేస్తున్నట్టు తెలిసింది. పైగా కాంగ్రెస్ పార్టీలో పాత, కొత్త నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్న తరుణంలో సురేఖను టార్గెట్ చేస్తే మొదటి తరం కాంగ్రెస్ వాదులంతా రేవంత్‌కు వ్యతిరేకంగా ఏకమవుతారని సీనియర్లు అధిష్ఠానానికి నివేదించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే సీఎం ఒత్తిళ్లను అధిష్ఠానం ఖాతరు చేయకపోవడం, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చేసిన రాయబారానికి హైకమాండ్ చేతుల్లో ఎదురుదెబ్బ తగలడంతో ప్రజల్లో జరుగుతున్న చర్చను పకదారి పట్టించేందుకు సీఎంవో ప్రత్యేక వింగ్ సరికొత్త డ్రామాకు తెరతీసిందనే ప్రచారం జరుగుతున్నది. అధిష్ఠానం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసే ఆలోచనతో ఉన్నదని, అందులో భాగంగా కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తుందని సీఎం అనుకూల సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నది. ఈ ప్రచారంతో సీఎం శిబిరం మీద అసమర్థ ముద్ర పడకుండా కొంత సమయం దొరుకడంతో పాటు, మంత్రివర్గ మార్పుల భయంతో మిగిలిన మంత్రులు, ఆశావహ ఎమ్మెల్యేలంతా అయోమయంలో పడి ఆటోమాటిక్‌గా రేవంత్‌రెడ్డి అదుపులోకి వస్తారనే వ్యూహం ఇందులో దాగి ఉన్నదని చెప్తున్నారు.