ప్రజా సమస్యలపై చర్చించడం, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, ప్రజల హక్కులకు రక్షణ కల్పించడం శాసనసభ ప్రధాన బాధ్యతలు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికే సభా నియమాలు, ప్రత్యేక హక్కులు ఉన్నాయి. అయితే, ఆ నియమాల అమల్లోనే రాజకీయ పక్షపాతం చోటుచేసుకొంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రశ్నార్థకంగా మారుతుంది. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో చోటుచేసుకొన్న పరిణామాలు ఇలాంటి అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ప్రతిపక్ష సభ్యుల నిరసనలను అడ్డుకోవడం నుంచి, ప్రభుత్వ సమాధానాల్లో వాస్తవాలపై సందేహాలు తలెత్తడం వరకు అనేక అంశాలు సభ గౌరవాన్ని, పారదర్శకతను ప్రశ్నిస్తున్నాయి.
ప్రజలు ఎన్నుకొన్న ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు వద్ద నిలిపివేయడం ప్రజాస్వామ్యానికి జరిగిన అవమానం. సభా నియమాల ముసుగులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ గొంతును అణచివేయడం, పోలీసు వ్యవస్థను ఉపయోగించి ప్రజాప్రతినిధుల నిరసనను అడ్డుకోవడం ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిని బయటపెట్టింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అసెంబ్లీ లోపలికి రాకుండా పోలీసులు అడ్డుకున్న ఘటనపై హైకోర్టు ఈ నెల 7న కీలక ఆదేశాలు జారీ చేసింది.
సభా నియమాల ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకోవాల్సింది సభాపతి తప్ప, పోలీసులు కాదని స్పష్టం చేసింది. సంబంధిత పోలీసు అధికారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇలాంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నది. మరి హైకోర్ట్ ఆదేశాలతోనే పోలీసుల అధికార దుర్వినియోగం బయటపడాల్సి వచ్చిందా? ప్రజాప్రతినిధులను అడ్డుకునే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? ప్రభుత్వానికి న్యాయస్థానం తీర్పు గట్టి చెంపపెట్టు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం, బీజేపీ సభ్యులకు మాత్రం ప్లకార్డులతో నిరసన తెలిపే అవకాశం కల్పించింది. ఒకే సభలో ఒకే రకమైన నిరసనలకు రెండు రకాల న్యాయాలు ఎందుకు? బీఆర్ఎస్ సభ్యులకు వర్తించిన నిబంధనలు, బీజేపీ సభ్యులకు ఎందుకు వర్తించలేదు? సభాపతి నిర్ణయాలు రాజకీయ పక్షపాతాలకు అతీతంగా ఉండాల్సింది పోయి, అధికార పక్షానికి అనుకూలంగా కనిపిస్తే ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం ఎలా మిగులుతుంది?
తమకు జరిగిన అన్యాయాలను ప్రతిపక్ష సభ్యులు మరుసటి రోజు సభలో ప్రస్తావించేందుకు సమయం కోరినా, వారిని పూర్తిగా సస్పెండ్ చేయడం ద్వారా ప్రశ్నించే హక్కును ప్రభుత్వం అణచివేసింది. గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ అంశంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేవలం 11 ఘటనలు మాత్రమే జరిగాయని ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అయితే, 25కు పైగా ఘటనలు జరిగినట్టు స్పష్టంగా తెలుస్తున్నది. ఇందుకు సంబంధించిన ఆధారాలు వివిధ పత్రికల్లోని వార్తల రూపంలో ఉన్నాయి. ప్రభుత్వం చెప్పిన సంఖ్యకు, అందుబాటులో ఉన్న ఘటనల వివరాలకు మధ్య వ్యత్యాసం ఉంటే దానికి బాధ్యత ఎవరిది? పిల్లల ప్రాణాలకు సంబంధించిన విషయంలోనూ వాస్తవాలను దాచిపెట్టడం అంటే ఎవరిని మోసం చేస్తున్నట్టు?
ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారం ఇవ్వడం శాసనసభ నియమ, నిబంధనల ప్రకారం సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. లెజిస్లేటివ్ రూల్స్ ప్రకారం ఇది తీవ్రమైన నేరం. ఇది కేవలం రాజకీయ తప్పిదం కాదు. ప్రజలు, ప్రజాప్రతినిధుల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్య. కాబట్టి, సభా నియమాల ప్రకారం ఈ వ్యవహారంపై స్పీకర్ సుమోటోగా స్పందించి, తప్పుడు నివేదిక ఇచ్చిన అధికారులు, ఇతర బాధ్యులపై ప్రివిలేజ్ మోషన్ లేదా సభాహక్కుల ఉల్లంఘన కింద వివరణ కోరి తక్షణ చర్యలు తీసుకోవాలి.
పార్లమెంట్లో నల్ల టీషర్ట్ ధరించి నిరసన తెలి పే నిబంధన ఉన్నదని, తెలంగాణ అసెంబ్లీలో అ లాంటి నిబంధన లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలో పేర్కొన్నారు. అయితే, పార్లమెంట్ నియ మ నిబంధనల ప్రకారం నల్ల దుస్తులతో నిరసనలకు ఆంక్షలు ఉన్నాయని పార్లమెంట్ నియమా లు తెలుపుతున్నాయి. అసెంబ్లీలో సోషల్ మీడి యా పోస్టును ధృవీకరించకుండానే చదివి, దానిని బీఆర్ఎస్కు ఆపాదించారు. పోస్టు ప్రామాణికత ఏమిటి? అనే విషయాలను నిర్ధారించకుండానే సభలో ప్రస్తావించడం బాధ్యతారాహిత్యం కాదా?
ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకున్న సభాపతి, అధికార పక్షం నుంచి వచ్చిన ఆరోపణలు, వాస్తవ విరుద్ధ సమాధానాలపై మాత్రం చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారు.ప్రజాస్వామ్యం
అంటే అధికార పక్షం చెప్పిందే నిజం కాదు. ప్రతిపక్షం ప్రశ్నించడం నేరం కాదు. సభా నియమాలు అధికారానికి ఒకలా, ప్రతిపక్షానికి మరోలా ఉండవు.
శాసనసభలో ప్రజల గొంతుకను అణచివేసి, వాస్తవాలను మరుగునపెట్టి, రాజకీయ పక్షపాతాలకు చోటిస్తే ఆ సభ గౌరవం ఎక్కడ మిగులుతుంది? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్‌దే. ఆ బాధ్యత నుంచి తప్పించుకొనే ప్రతి క్షణమూ చరిత్రలో నమోదవుతుంది. ప్రజాస్వామ్యానికి బలం మెజారిటీ సంఖ్యలో కాదు.. వాస్తవాలను అంగీకరించే ధైర్యంలో, ప్రశ్నించే గొంతులను గౌరవించడంలో ఉన్నది. ఆ స్ఫూర్తిని తెలంగాణ అసెంబ్లీ కాపాడుతున్నదా? లేక రాజకీయ పక్షపాతాలకు వేదికగా మారుతున్నదా? ప్రజలు గమనిస్తున్నారు.
-బక్కోళ్ల శ్రీకర్