న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ఇండ్లు కొనేందుకు అవకాశాలున్నవారిలో కేవలం 19 శాతమే కొత్తగా మొదలైన నిర్మాణ ప్రాజెక్టుల్లో నివాసాల కొనుగోలుకు ముందుకొస్తున్నారని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా ఓ సర్వేలో తెలియజేసింది. అయితే 31 శాతం మంది పూర్తయిన అపార్ట్మెంట్లపట్ల ఆసక్తి చూపిస్తున్నారని గురువారం ‘హోమ్బయ్యింగ్ సెంటిమెంట్ సర్వే 2026: డీకోడింగ్ ఇండియాస్ ఇవాల్వింగ్ బయ్యర్ ప్రిఫరెన్సెస్’ పేరిట విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది.
దేశవ్యాప్తంగా 30కిపైగా నగరాల్లో జరిగిన ఈ సర్వేలో దాదాపు 1,800 మంది తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అలాగే 30 శాతం గృహ కొనుగోలుదారులు త్వరలో పూర్తయ్యే ఇండ్లను సొంతం చేసుకోవాలని చూస్తున్నట్టు తేలింది. ఇక 20 శాతం మంది నిర్మాణ దశలో ఉన్నవి కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ‘రెడీ-టు-మూవ్’ ఇండ్లకే అత్యధికులు తమ ఓటేస్తున్నట్టు స్పష్టమైంది.
డెవలపర్లకు దెబ్బ
కొత్త నివాస ప్రాజెక్టులను మొదలు పెట్టాలనుకొనే డెవలపర్లకు ముందస్తు బుకింగ్ చేసుకొనే కస్టమర్లే బలం. అయితే తాజా రిపోర్టులో సదరు కస్టమర్లు 100లో ఐదో వంతులోపేనని తేలింది. దీంతో ఈ పరిస్థితిని నూతన వెంచర్ల ప్రారంభానికి పెద్ద దెబ్బగా ఇండస్ట్రీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. కొనుగోలుదారులు పెరుగకపోతే నగదు కొరతతో మున్ముందు ప్రాజెక్టులన్నీ తగ్గిపోయే ప్రమాదం ఉందని, ఇది కేవలం దేశీయ నిర్మాణ రంగానికేగాక, దాని అనుబంధ రంగాలు, చివరికి దేశ ఆర్థిక ప్రగతికీ ఇబ్బందేనని అంటున్నారు.
ఇదిలావుంటే వచ్చే రెండేండ్లలో ఇల్లు కొంటామని 50 శాతం మంది ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ధరలు, ఇతర రిస్క్‌ల దృష్ట్యా కొనుగోలు నిర్ణయాల్లో ఆచితూచి స్పందించే మనస్తత్వం కనిపిస్తున్నట్టు కొలియర్స్ అంటున్నది. ఉద్యోగ భద్రతకు సంబంధించిన ఆందోళనలు, ఆదాయాల్లో వ్యత్యాసాలే కారణం. అలాగే 31 శాతం మంది అందుబాటు ధరల్లో స్థలాలు, వాటి ధరలపట్ల ఒకింత భయంతో ఉన్నారు. కాగా, రూ.50 లక్షలు-రూ.1.5 కోట్ల మధ్య ధరలు కలిగిన స్థిరాస్తుల్ని కొనేందుకు 46 శాతం మంది మొగ్గు చూపుతున్నారు. కానీ మెజారిటీ కొనుగోలుదారులు ఆకర్షణీయమైన ధరలు, సౌకర్యవంతమైన చెల్లింపుల ఆధారంగానే ముందడుగు వేస్తామని చెప్తున్నట్టు కొలియర్స్ ఈ సందర్భంగా వెల్లడించింది.
చిక్కుల్లో మధ్య తరగతి కస్టమర్లు
అధిక భూముల ధరలు, పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలతోపాటు సిమెంట్, స్టీల్, రంగులు, ఎలక్ట్రిక్ ఉత్పత్తులు ఇతర ముడి సరుకు ఖర్చుల కారణంగా మధ్యతరగతి వర్గాలు రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు దూరమవుతున్నారన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా డెవలపర్లు అన్ని హంగులతో కూడిన ఇండ్లనే అమ్మకానికి తెస్తుండటంతో ఇప్పుడున్న నివాసాల ధరలు ఎక్కడ చూసినా రూ.50 లక్షలకుపైగానే పలుకుతున్నాయని గుర్తుచేస్తున్నారు. నగర శివార్లలో కూడా మధ్య తరగతి వర్గాలు కొనలేకపోవడం.. మార్కెట్‌కు ప్రతికూలమేనని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక గృహ రుణాలపై వడ్డీరేట్ల భారంతో సామాన్యుడి సొంతింటి కల కలగానే మిగిలిపోతున్నదని, ఇది నిర్మాణ రంగాభివృద్ధికి మంచిది కాదని మెజారిటీ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.