సిటీబ్యూరో, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ప్రతి ఏటా మాదిరిగానే వినాయక చవితి వేడుకలతో పాటు, ‘హుస్సేన్ సాగర్ నిమజ్జన’ ప్రక్రియపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ , రసాయన రంగులతో తయారు చేసిన గణేశుడి విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయరాదంటూ న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం సందిగ్ధత సజీవంగానే ఉంది.
ఒకవైపు కోర్టు తీర్పునకు కట్టుబడి ఉన్నామని చెప్పేందుకు సాగర్ చుట్టూ ‘నో నిమజ్జనం’ ఫ్లెక్సీలు, 10 ఫీట్ల రెయిలింగ్ ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ, మరోవైపు నిమజ్జనోత్సవానికి అవసరమైన క్రేన్లు, ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. వాస్తవంగా నిబంధనలకు అనుగుణంగా శాశ్వత ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడంలో అధికారులు విఫలవుతూ వస్తున్నారు. 2022, 2023 సంవత్సరాల్లో హైకోర్టు ఇచ్చిన కచ్చితమైన ఉత్తర్వుల ఆధారంగా అధికారులు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే ఉత్సవాల వేళ కోర్టు ఉత్తర్వులను అధికారులు కేవలం ఫ్లెక్సీలకే పరిమితం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ నెల 14న ప్రారంభమైన గణేశ్ నవరాత్రుల్లో పూజలందుకున్న విగ్రహాల మూడో రోజు నిమజ్జన ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభమైంది. వరుసగా 5వ, 7వ, 9వ రోజులతో పాటు ఈ నెల 25న తుది నిమజ్జనోత్సవం జరగనుంది. ప్రత్యామ్నాయ చర్య ల్లో భాగంగా హుస్సేన్ సాగర్ చుట్టూ ఎన్టీఆర్ మార్గ్‌లో 17, అప్పర్ ట్యాంక్ బండ్ పై 20 క్రేన్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించారు. బేబీ పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి పీవీ నర్సింహారావు మార్గ్ (నెక్లెస్ రోడ్), పీపుల్స్ ప్లాజాతో పాటు నగరంలోని వివిధ ప్రాంతా ల్లో ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ కృత్రిమ కుంట లు (బేబీ పాండ్లు) ఏర్పాటు చేసింది. వీటితో పాటు చిన్న విగ్రహాల కోసం నగరవ్యాప్తంగా బేబీ పాండ్లను సిద్ధం చేసి, వెంటనే విగ్రహాల డెబ్రిస్ తొలగించేలా క్రేన్లను ఏర్పాటు చేశారు.
ప్రధానంగా బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు సాగే 19 కిలోమీటర్ల మేర శోభాయాత్ర రూట్ పై ప్రభుత్వం, పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. మధ్యాహ్నం 1 గంటలోపు బాలాపూర్ గణపయ్య చార్మినార్ దాటేలా పకా ప్లాన్ అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట నాటికి ఖైరతాబాద్ బడా గణేశ్, మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల లోపు బాలాపూర్ గణనాథుని నిమజ్జనం పూర్తయ్యేలా సమయపట్టిక రూపొందించారు. ఈ మేరకు ఇటీవల రెవెన్యూ, జీహెచ్ ఎంసీ, పోలీస్, జలమండలి, ఫైర్ విభాగాల ఉన్నతాధికారులు ఉమ్మడిగా ఈ రూట్‌ను తనిఖీ చేసి ఏర్పాట్లను సమీక్షించారు. మొత్తంగా హుస్సేన్‌సాగర్‌లో కాలుష్యాన్ని నివారిస్తూనే, భక్తుల భావోద్వేగాలకు భంగం కలగకుండా నిమజ్జనోత్సవాన్ని సజావుగా సాగదీయడం అధికారులకు సవాలుగా మారింది.