హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి సంబంధించి నిర్వహించనున్న ప్రాథమిక రాత పరీక్షల తేదీలను తెలంగాణ పోలీస్ నియామక మండలి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎస్సై స్థాయి పోస్టుల ప్రాథమిక రాత పరీక్షను నవంబర్ 29న, కానిస్టేబుల్ స్థాయి పరీక్షను డిసెంబర్ 20న నిర్వహించేందుకు బోర్డు ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. పోలీస్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, అగ్నిమాపక-విపత్తు స్పందన, జైళ్ల శాఖల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 పోస్టుల భర్తీకి జూలై 29న నాలుగు నోటిఫికేషన్లు జారీ చేసినట్టు చైర్మన్ పేరొన్నారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం గరిష్ఠ వయోపరిమితిపై ఎస్సై, ఏఎస్సై, డ్రైవర్ పోస్టులకు 7 ఏండ్లు, ఇతర కానిస్టేబుల్ పోస్టులకు 10 ఏండ్ల సడలింపు ఇవ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.13 లక్షల మంది నిరుద్యోగులకు లబ్ధి చేకూరినట్టు ఆయన తెలిపారు. ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్16 వరకు 28 రోజులపాటు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించగా.. మొత్తం 4,29,000 మంది అభ్యర్థుల నుంచి 5,77,064 దరఖాస్తులు వచ్చినట్టు శ్రీనివాసరావు వెల్లడించారు.
నియామక ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రవేశపెట్టిన ఆధార్ ఫేస్ అథెంటికేషన్‌ను 97.4 శాతం మంది అభ్యర్థులు తమ మొబైల్స్ ద్వారా విజయవంతంగా పూర్తిచేశారని, సాంకేతిక సమస్యలతో పూర్తిచేయని 2.6 శాతం మందికి ఈ నెల 30 వరకు గడువు పొడిగించినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ఎస్సై సివిల్, కానిస్టేబుల్ సివిల్ పోస్టులకు ప్రాథమిక పరీక్షతో ప్రారంభమయ్యే 3 దశల ఎంపిక విధానం ఉంటుందని, ఏఎస్సై ఎఫ్‌పీబీ(11,992 దరఖాస్తులు), డ్రైవర్ పీసీ (12,495 దరఖాస్తులు), మెకానిక్ పీసీ (2,465 దరఖాస్తులు) వంటి పోస్టులకు శారీరక పరీక్షలతో మొదలయ్యే 2 దశల ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి 56.84 శాతం మంది తెలుగు, 43.02 శాతం మంది ఇంగ్లిష్, 0.12 శాతం మంది ఉర్దూను పరీక్ష మాధ్యమంగా ఎంచుకున్నట్టు తెలిపారు. నవంబరు 29న జరిగే ఎస్సై ప్రాథమిక పరీక్షను ఉమ్మడి 10 జిల్లాల కేంద్రాల్లో, డిసెంబర్ 20న జరిగే కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షను 15 నుంచి 18 ప్రాంతాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీనివాసరావు వెల్లడించారు.

మొత్తం దరఖాస్తుదారుల్లో 68.45 శాతం మంది ఒకే పోస్టుకు దరఖాస్తు చేసినట్టు శ్రీనివాసరావు తెలిపారు. కేవలం 28.88 శాతం మంది రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఇక 2.42 శాతం మంది 3 పోస్టులకు, 0.2 శాతం మంది 4 పోస్టులకు, 0.046 శాతం 5 ఐదు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్టు వివరించారు. సామాజికవర్గాల వారీగా అందిన దరఖాస్తులను పరిశీలిస్తే.. 49.19 శాతం బీసీ, 43.60 శాతం ఎస్సీ/ఎస్టీ (వీరు 50% ఫీజు రాయితీ పొందారు), 7.20 శాతం ఓసీ దరఖాస్తులు ఉన్నాయని తెలిపారు. ఓసీ క్యాటగిరీలో 3.45 శాతం దరఖాస్తులు ఇతర రాష్ట్రాల అభ్యర్థుల నుంచి వచ్చాయని చెప్పారు. మొత్తం దరఖాస్తుల్లో పురుషుల నుంచి 4,30,844 (74.66%), మహిళల నుంచి 1,46,220 (25.33%) వచ్చినట్టు వెల్లడించారు.