న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: భారత్‌లో విద్యా స్వేచ్ఛ తీవ్ర ఆంక్షలను ఎదుర్కొంటున్నట్టు ఉన్నత విద్యపై దాడులను పర్యవేక్షించే అంతర్జాతీయ నెట్వర్క్ స్కాలర్స్ ఎట్ రిస్క్ పేర్కొంది. ఫ్రీ టు థింక్ 2026 అనే పేరుతో వెలువరించిన తన నివేదికలో ఉన్నత విద్యపై పెరుగుతున్న కేంద్ర ప్రభుత్వ పెత్తనం విశ్వవిద్యాలయ పరిపాలన, నాయకత్వ నియామకాలు, విద్యా ప్రాధాన్యతలను ప్రభావితం చేస్తున్నదని పేర్కొంది. విశ్వవిద్యాలయ నిర్వాహకులు తీసుకున్న చర్యలు క్యాంపస్ చర్చలను, విద్యార్థుల భావప్రకటనా స్వేచ్ఛను అణచివేశాయని కూడా ఆ నివేదిక సూచించింది.
అధ్యాపకులను తొలగించడం, విద్యా సంబంధిత కార్యక్రమాలను రద్దు చేయడం, విద్యార్థుల భావప్రకటనా స్వేచ్ఛను కట్టడి చేసే విధానాలను ప్రవేశపెట్టడం వంటివి ఇందులో ఉన్నాయి. 2025 జూలై 2-2026 జూన్ 30 మధ్య 59 దేశాలు, ప్రాంతాలలో ఉన్నత విద్యా వర్గాలపై జరిగిన 382 దాడులను స్కాలర్స్ ఎట్ రిస్క్ సంస్థ నమోదు చేసింది. గత దశాబ్ద కాలంలో విశ్లేషించిన 179 దేశాల్లో 50 దేశాల్లో విద్యా స్వేచ్ఛ గణనీయంగా తగ్గిందని తెలిపే ‘2026 అకడమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్’ గణాంకాలను కూడా ఈ నివేదిక పేర్కొంది.
అదే కాలంలో కేవలం 9 దేశాలు మాత్రమే మెరుగుదలను నమోదు చేశాయి. హాంకాంగ్, ఇండోనేషియా, పాకిస్థాన్, వెస్ట్ బ్యాంక్, ఉక్రెయిన్లతో పాటు ఈ నివేదికలో భారత్ తీవ్రమైన ఆంక్షలు ఉన్న విభాగంలో చేరింది. అత్యంత తక్కువ స్థాయి అయిన పూర్తిగా నియంత్రిత విభాగంలో అఫ్ఘానిస్థాన్, చైనా, ఇరాన్, రష్యా, తుర్కియే, సిరియా, వెనెజువెలా, జింబాబ్వే, గాజా ఉన్నాయి. ఉన్నత విద్యలో అసమ్మతిని అణచివేసి, రాజకీయ సిద్ధాంతాలను బలవంతంగా రుద్దేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాల గురించి నివేదిక హెచ్చరించింది.
బీజేపీపై వ్యాఖ్యలు
భారత్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఉన్నత విద్యపై తన అధికారాన్ని విస్తరించిందని, విశ్వవిద్యాలయ పరిపాలన, నాయకత్వ నియామకాలు, విద్యా ప్రాధాన్యతలను ప్రభుత్వం ప్రభావితం చేస్తున్నదని నివేదిక పేర్కొంది. విశ్వవిద్యాలయ నిర్వాహకులు క్యాంపస్ చర్చలను అణచివేసే చర్యలు తీసుకున్నారని కూడా నివేదిక పేర్కొంది. అధ్యాపకులను తొలగించడం, విద్యా సంబంధిత కార్యక్రమాలను రద్దు చేయడం, విద్యార్థుల భావప్రకటనా స్వేచ్ఛను కట్టడి చేసే కొత్త విధానాలను అమలు చేయడం వంటివి ఇందులో ఉన్నాయి.
నిరసనలు, లేదా ఇతర క్యాంపస్ సమావేశాల సందర్భంగా విద్యార్థులు, పోలీసులు ఇద్దరూ హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని ఆ నివేదికలో తెలిపారు. ఉన్నత విద్యపై తమ ప్రభావాన్ని చూపడానికి బీజేపీ యూజీసీని ఒక ప్రధాన సాధనంగా ఉపయోగించడం కొనసాగించిందని కూడా నివేదిక ఆరోపించింది. విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వ నియంత్రణను కఠినతరం చేసేవిగా భావించిన విధానాలపై యూజీసీ విమర్శలను ఎదుర్కొంది. వీటిలో వైస్ చాన్సలర్ల కోసం విద్యార్హత అవసరాలను సడలించడం, తాత్కాలిక, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీలపై ఉన్న 10 శాతం పరిమితిని తొలగించడం వంటివి ఉన్నాయి.
పడిపోయిన ఇండెక్స్
అకడమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్‌లో భారత్ స్కోరు 2022లో 0.38 ఉండగా 2025 నాటికి అది 0.14కు పడిపోయిందని నివేదిక పేర్కొంది. ఈ క్షీణత ఒక విస్తృతమైన ప్రపంచ ధోరణిలో భాగమని తెలిపింది. అమెరికాలో సంస్థాగత స్వయం ప్రతిపత్తి 2019లో 3.3గా ఉండగా 2025 నాటికి అది 1.7కు పడిపోయింది. కేవలం 2024లోనే ఈ స్కోరు 2.4కు తగ్గింది.