“ఆ.. నా అకౌంట్ల లచ్చలు ఉన్నయ్ మరీ! వాళ్లు ఎత్కపోనీకి. ఇగ నువ్వేమో నోట్లకట్టలు జమ చేయవడితివి మరీ!”అనే వెటకారంగా..“సరే! జెర పైలం. ఎంతైనా ఈ ఫోను మా సెడ్డదే!? ఎప్పుడు ఏం కత వెడ్తదో!?” అనుకుంట ఇల్లు చేరిర్రు.
ఇంటి ముంగట మంది బగ్గనే జమైండ్రు. “అయ్యో మల్లేషా! మా ఇంటికన్న ఒచ్చి ఒక ముచ్చటైన జెప్పకపాయే! ఎంత పని జేసిండు. ఇప్పుడు వాని పెండ్లాం పిల్లలు ఆగమైర్రు!” అని కొంగు మూతికాడవెట్టి, ఒక్క తీర్గ దుఃఖం ఎల్లవోస్తున్నది రామక్క.మల్లేష్ పెండ్లాం పద్మ సుట్టూర కూసోని వాడకట్టోళ్లంత గూడి శోకాలు వెడుతార్రు. “ఔనే పద్దీ! ఏమైందే.. పగటీలి ఏ సప్పుడు లేకుండే! మంచిగనే ఉంటిరి గదనే? రాత్రి ఏమనుకున్నరే.. పానం తీస్కునేంత కట్టమేమచ్చిందే.. శెప్పవేమే” అని అడుగుతున్నది రామక్క.ఆమె ప్రశ్నలకు జవాబిస్తలేదు. లోపటున్నది బైటవెడ్తలేదు. అండ్లదండ్లనే కుమిలి గోడకు ఒరిగి.. మొగన్ని, అత్తను దీనంగ సూత్తున్నది పద్మ. “ఓ తమ్మీ.. నా తమ్మీ! నువ్వెంత పని జేస్తివిరా.. నా అయ్యా!” అనీ గట్టిగ ఒర్లుత.. రొండు శేతులు చాతి మీద గుద్దుకుంట.. మల్లిగాని మీదొచ్చి పడ్డడు పెద్దబాపు కొడుకు సాయన్న. అది జూసిన తన భార్య ఒక్కసారిగా దీర్ఘం తీసింది. ఆడున్నోళ్లకు దుఃఖం ఆగుతలేదు. అందరు ఏడుపు మొదలువెట్టిర్రు. జెరాగి సాయన్న లేసి.. “ఓరి పోడా రాజు! ఇంటెన్క గడ్డాములకెల్లి మోపెడంత గడ్డి తేపో! కాకను కిందేసిర్రు. గాయింత సోయి లేదారా!” అనే.. ఆ పోరడు పోయి మోపెడంత ఎందుకని సందెడంత గడ్డి పట్కచ్చిండు. ఇంట్లకెల్లి పీటె తెచ్చి, దాని మీద గడ్డేసి పండేశిర్రు. తలాపున గాంచునూనె దీపం, ఆగరుబత్తీలు. నొష్టికి ఇంత కుంక్మ, ఒక రూపాయి సిక్కతో.. శెవాన్ని సింగారిచ్చి ఆకిట్ల ఒక బాదుకు అగ్గి రాజేసిర్రు.. “రాజు.. గా శివన్నకు ఫోన్ జేసి టెంటు, కుర్చీలు తీస్కరాపో!” అనే సాయన్న.
నిమిషాల్ల తెచ్చి ఏశిర్రు. పెద్ద మనుషులు కూసున్నరు. దోస్తులకు ముచ్చట తెల్సి వస్తున్నరు. అటెన్క గీ కార్యం సుట్టపోల్ల శెవినెయ్యాలే! తల్లిగారికి మొదాలు జెప్పాలె! ఇగ గా పని మీదున్రు. ఎవలికి తోశినోల్లు వాళ్ల బంధుబల్గానికి పోన్లు కొడుతున్నరు. బిరాన్నే చేరుతాంది మత్లావ్.. ఎన్కటి దినాలు గావాయే! ఇంట్ల ఎవలన్న కాలంజేత్తె మొదాలు ఇంటికాపుతోని ఊర్లపొంటి వార్త చెప్పి పంపేది. ఆ రోజులు ఇప్పుడు యాడున్నయ్!? ఫోన్లనే సెకండ్ల మీద ఊర్లు, దేశాలు దాటి పోతున్నయ్.. శింటు వాకిట్ల పండుకున్న తండ్రిని చూసి లోపటనే బెక్కున పల్గుతున్నడు. పద్మ వాన్ని దగ్గరికి తీస్కోని ఏడుస్తున్నది. ఆడున్నోళ్లకు వాళ్ల గోస సూడ వశమైతలేదు.
మందిల రాజంతాత గంగదరి పటేల్తోని.. “ఏ.. పోరడు ఏమంత పెద్దోడు గాదు. శిన్న ఈడే! పదో తరగతి సదివిండు. శిన్నప్పటి సంది ఒక్కడే కొడుకాని పాయిరంగ పెంచి బగ్గ లాడుజేసిర్రు కనీ.. వీడు ఇట్ల జేస్తడని ఎవలనుకుంటరే? సంసారం అన్నంక శిన్నశిన్న జౌడాలు ఐతనే ఉంటయ్! అందరిండ్లల జరిగేటియే! ఈల్లేమన్న మీదికెల్లి ఊశి పడ్డారూ? ఇంటింటికి మట్టి పొయ్యే ఉంటది. బంగారు పొయ్యి ఉండది. గాయింత దానికే గిట్ల జేసుకుంటరా? ఊరేమన్న గొడ్డువోయిందా!? నలుగురిని కూసుండవెట్టి మెప్పిచ్చేదుండే! లంగెవలో దొంగెవలో తేలుతుండే! ఉత్తపున్నానికే పానం దీసుకుంటారు!? ఐనా.. ఇప్పటి పోరలే ఇట్ల జమైండ్రు. అయ్యవ్వల ఖదర్ల లేక ఇట్ల జేస్కొని ఇంకో నలుగురికి నేర్పుతాండ్రు. వీని పనికినవారేతు..” అని అంటున్నడు.ఇది జరగడానికి కొన్ని రోజుల ముందు ముచ్చట..
మబ్బుల ఐదుగొట్టంగ లేసి.. “అవ్వా! నేను బాయికాడికి పోతున్న. ఇయ్యాల మిరపచెట్లకు మందు కొట్టాలె! పొద్దంత ఆడనే పనుంటది. శింటుగాన్ని బడికి పంపి దాన్ని తోల్కోని ఇంత సద్ది పట్కరాయే!” అనీ బాయిబాట వట్టిండు మల్లేష్.వాకిట్ల సాన్పి జల్లుతున్న తల్లి ఏదో అనబోయింది. అది వినబడనట్టు వాడు శీకట్ల కలిసి పోయిండు. ఇగ వీనికి చెప్పినా లాభం లేదనీఆ లోటల పెండనీళ్లను లక్కొద్ది వాకిలికేసి సరుస్తున్నది. మొక్కంగ పుట్టిండు ఒక్కగానొక్క కొడుకానీ.. గావురంగ పెంచి, పెద్ద జేస్తే.. నడిమంత్రాన అయ్యవోయిండు. గంజో గాసమో తాగి కడుపు కట్టుకొని ఇంతటోన్ని జేసిందామె. ఇగ వీని పెండ్లాం పేరు పద్మ. మ్యాన మరదల్నే లగ్గం చేసుకున్నడు. ఇంటర్ సదివింది. మా ఉషారున్నది కనీ.. దానికి సెల్లు సోకెక్కువ. ఎప్పుడూ అండ్లనే దాని పానమంత. ఫొటోలు దిగాలే, రీల్స్ చెయ్యాలే.. సోషల్ మీడియాల పెట్టాలే! పెండ్లయినంక మారుతదని అన్నరు కనీ.. గా సోకు ఇంకా ఎక్కువ అయింది. ఆ రీల్స్ చూసి సుట్టాలు, వాడకట్టోళ్లు అట్ల చేయొద్దని చెప్పిర్రు. అయినా వాళ్ల మాటలు పట్టించుకోలేదు. దాని సోకు దానిదే! మ్యాన మరదలేననీ వీడు కూడా అంతగా పట్టించుకోలే! దాని కడుపుల కాయగాస్తే.. అదే సంసారం రోకుల పడ్తదని అనుకున్నడు. లగ్గమైన యాడాదికే కొడుకు పుట్టిండు. అయినా ఫోన్ చూసుడు ఇంకా ఎక్కువనే అయింది. అంబటాళ్ల దాక పన్నపక్కలకెల్లి లేసేది కాదు. గంతకు దగ్గ బొంతోలే దాపురించిందని అత్త బాధ.
తెల్లారంగ వాడకట్టుల సర్రు సుర్రుమని శీపుర్ల సప్పుడు, కోడి కూతలు, పసుల అరుపులు, రాముల గుడి కాడి మైకు సెట్ల కలిసి.. ఊరంతా నిద్ర లేస్తున్నది. సాన్పి సల్లుడు అయింది. ఇంట్ల బోల్లు, ముంతల సదిరే సప్పుడుకు పోరడు బొంత నిండా కప్పుకొని తల్లి పక్కలకు జారిండు.“పొద్దు పొడుపొస్తాంటే మీకు నిద్రెట్ల వడుతుందే! పక్కబొక్కలు నొస్తలెవ్వా!? మీ నిద్రకగ్గిదల్గ.. లెవ్వరేందే!?” ఆ గున్సుడుకు పద్మ లేసి, అత్తను కోపంగ చూసి.. పక్కనున్న సెల్లు తీస్కోని ఆరోజు ఏం స్టేటస్ పెట్టాలని రీల్స్ సెలెక్ట్ చేస్తున్నది. ఆ పాటల సప్పుడుకు పోరడు లేసి, తల్లి చేతిల ఉన్న సెల్లు వెలుగులనే సూర్యోదయం చూసిండు.. “అమ్మా! బాయిల బల్లి పాట పెట్టు! నిన్న చేసినవ్ కద.. పొట్టు పొట్టు లైకులొస్తయే!” అనే ముసి ముసిగ. “ఆ.. సరేరా!” అని అదే పోస్టు చేసింది.“నా కొడుకు రాత్రింబగలు కష్టపడి పెయి పుండుజేస్కొని, బురుద బుక్కి పొర్లాడుతుంటె.. మీరేమో గీ పోన్ల తైతక్కలాడుతున్నారు?”ఆమె మాటలు వినిపించనట్లే.. బైటకెల్లి బనుకు మీద కుసోని రీల్స్ చూస్తున్నరు ఇద్దరూ..! ఆమె బోల్లు తెచ్చి జాలట్లేసి, చెంబు తీసుకుని బైటికి నడిచింది. పద్మ ఫోను పోరనికిచ్చి జాలట్లకు పోయింది. తర్వాత వాకిట్ల ముగ్గేస్తూ.. మాటి మాటికీ పోరని చేతిల ఫోన్ దిక్కే సూత్తున్నది. టన్ టన్నుమని కామెంట్ల సప్పుడు మోగుతున్నది. గా సప్పుడుకు ముగ్గాపి, ఫోన్ తన శేతిలకందుకొని.. ఎంతో ఆశగా కామెంట్లు, లైకులు ముసిముసిగ చూస్తూ నవ్వుతున్నది.. చంద్రముఖి పూనిన గంగోలె! రెండు కండ్లు పెద్దగజేసీ!
అత్త పాలు తెచ్చి.. “అయిందా మీ పోను నూకుడు! పొయ్యి రాజేసి ఇంత కూడు ఉడ్కవెడితే బాయి మొఖానా పోవాలే! అరేయ్ శింటు.. తానంజేసి ఇంత తిని బడికి పోదువు తయార్ కాపో!” అని ఒర్లింది అత్త.వాడు జాలట్లకు ఉర్కిండు. ఈమె ఫోన్ చార్జింగ్ పెట్టి, గా పనిలవడ్డది. కానీ, మనసు మాత్రం ఆ టింగ్మనే నోటిఫికేషన్ల మీదనే ఉంది. పోరడు బడికి వోయిండు. వీళ్లు సద్ది కట్టుకొని బాయిబాట వట్టిర్రు. తొవ్వొంట ఒక చేతితో నెత్తిన సద్దిగంప, ఇంకో చేత సెల్లు చూస్తాంది పద్మ. ఎదురుగ రవి సైకిల్ మీదొచ్చి.. “ఏమొదినే.. ఇయ్యాల రీల్ మస్తుంది!” అని నగుకుంట వోతాండు.“ఔనా పిలగా! అంత బాగుందా!? అయితే షేర్ జేసి స్టేటస్ పెట్టుకో!” అని వయ్యారాలు వోతున్నది పద్మ. ‘అది ఏం రీలో.. ఏందో!? ఇదెప్పుడో మా సంసారం బజాట్ల పెడుతది గనీ!’ లోపల్లోపల్నే బుగులు వడ్డది అత్త.అటీటు మెల్లెగ బాయికాడికి చేరిర్రు.
చెట్లకు పురుగు మందు కొడుతాండు మల్లేష్. ‘వానికి రోజు పనే. శేను పూతకచ్చి ఆకు ముడత వడుతంది. ఈ పంట మంచిగొస్తే పటేల్ బాకీ సుత్త జేయాలని వాని కోరిక. అగ్గో.. గా కొసల కొడుతున్న మందు వాసన బాయికాడి గుడిసెలకు ఇసురుతాంది. ఎట్ల భరిస్తాండో ఏమో!? నెత్తికి తువాల తప్ప మూతికి బట్టసుత కట్టుకోలే కొడుకు!’ అని తల్లి తల్లడిల్లుతాంది. అదేమీ పట్టనట్టు పద్మ మొఖం మీద కొంగు కప్పుకొని రీల్స్ చూస్కుంట మురుస్తాంది. అట్లుంటది మరీ.. దాని పని వరుస. ఒకనాడు భారీ వర్షం. పొలానికి పోయినోడు ఇంటికి రాలేడు.“ఏమే! కొడుకు ఇంకా రాకపాయే! నువ్వేమో ఆ పోన్లకెల్లి మూతి తీయవు. ఈ జోరు వానల యాడ ఆగిండో!? గా చెత్రి తీస్కొనీ పోయి చూసిరాపో” అనే అత్త.సరేననీ చెత్రి పట్కొని పోయింది పద్మ. పోంగ తొవ్వల ఒక చెట్టు కింద ఆగి.. ఆ చినుకుల్ల రీల్ చేద్దామని అనుకుంది. అక్కడ ఆ రాలిన ఆకుల కింద పాకురు పట్టింది. సూడలే పొల్ల. కాలు లేపి ఒక దుంకు దుంకి.. జారి బొక్కబోర్లా వడ్డది. ఫోన్ నీళ్లల్ల పడ్డది. మోకాలి నుంచి నెత్తురు.. వాన దారల కలిసి ఎర్రని కుంకుమోలె పారుతున్నది. లేచి ఏడుపు మొఖంతోని ఇంటికి నడిచింది.వాన ఆగింది. ఇల్లు చేరుకున్నడు భర్త. ఇంటికొచ్చి దాని ఏడుపు విని.. ఏమైందని అడిగితే, జరిగింది చెప్పలేక తొవ్వల జారి పడ్డానని అబద్ధం. కాలుకు మొలాం రాసిండు. దెబ్బ తల్గిందనే బాధ లేదు. దాని పానమంత సెల్లు నానిందనే! టౌనుకు పోయి ఆ సెల్లు బాగు సేపిచ్చే దాక వినలేదు, తినలేదు. ఇంత సెల్లు పిచ్చి ఉన్న మనిషిని భరిస్తూ.. ఆ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెల్వక వాడు నలిగిపోతున్నడు.
తెల్లారి చేన్లకు పోయి చూస్తే వానకు సగం పూత రాలిపోయింది. చేసిన కష్టం గంగపాలైందని బాధపడ్డడు. రైతు కష్టమంటే ఇంతే! వానే మురిపిస్తది. వానే ఏడిపిస్తది. అట్ల తొల్త కిత్త మిర్చి తెంపి మార్కెట్ల అమ్మిండు. తక్కువ పైకమే వచ్చింది. అమ్మితే వచ్చిన పైసలు అకౌంట్ల జమ చేసిండు. వాని చిన్న ఫోను మొన్న వానల తడిసి పాడైంది. కొత్త ఫోను కొనేదాక తన సిమ్ పద్మ ఫోన్ల వేసుకున్నడు. అటు పటేల్ అప్పు, ఇటు తల్లి కంటి పరీక్ష. వచ్చిన పైకమేమో ఎటూ సరిపోదనీ.. రెండో కిత్తల తెంపిన పంట అమ్మినంక అప్పు తీర్చి, కొత్త ఫోన్ కొందామని అనుకున్నడు.
ఆ సాయంత్రం ఊళ్లే దండోరా మోగింది. కచ్చీర్ కాడ ప్రోగ్రాం పెడుతున్నరు. పిల్లజెల్లా, ముసలీముతక అందరూ రావాలనీ..! ఊరంత కచ్చీర్ కాడికి చేరుతున్నరు. కచ్చీర్ ముంగట స్టేజీ. దాని మీద ఒక పెద్ద పల్కటీవీ, సౌండు బాక్సులు పెట్టిర్రు. అక్కడ ఉన్న పోరలు ఇట్లా అనుకుంటుండ్రు.. “ఏంరో! ఏంది గీ ప్రోగ్రాం. బలగం సీన్మ లెక్క, గా రాజు-రాంబాయి సీన్మ సూపిస్తరా ఏందీ..!”“ఏ ఊకోరా! సీన్మ అయితే సర్పంచ్ సాబ్ చూపిస్తడు కనీ.. పోలీసులు ఎందుకస్తరు?”“అరే! గా టీవీని సూత్తాంటే.. ఇదేదో సర్కారు దావఖాన్ల చెప్పే ముట్టుకుంటే అంటుకునే రోగం ఉంటది సూడు.. గదేరా ఏడ్సురోగం! ఆ ప్రోగ్రాం అనిపిస్తాందిరో”. “టీవీల పస్టు బిట్లు ఏస్తరు. అట్ల జేస్తే రోగం ఎట్లొస్తదోనని సూపిస్తర్రా!” అనీ ఒకడు.
“బిట్లా!? అంటేందిరో?” “హే.. గవే రా! మన సర్పంచ్ రోజూ గడ్డాము ఎన్క జేసేటియే!” అనే.. పైంటు మీదికి ఎగజెక్కుతూ..“ఛల్! మీరనుకునేది కాదురా! సైబర్ నేరగాళ్లు మన ఫోన్లకు మెసేజులు పంపి, అవి ఓపెన్ చేస్తే మన అకౌంట్ల పైసల్ ఎట్ల మాయం చేస్తరో చూపెట్టనీకి పెట్టిన ప్రోగ్రాం!” అని బ్యానర్ మీదున్న అసలు సంగతి సదివి అందరినీ సల్లవడగొట్టిండు రాజు. ఇగ ప్రోగ్రాం చాలయ్యింది. ‘మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. తెలియని వ్యక్తులు మీ ఫోన్‌కి పైసలొచ్చినయని ఆశ చూపి.. లింక్స్ పంపుతరు. అవి ఓపెన్ చేస్తే మీ అకౌంట్ల ఉన్న పైసలు ఖాళీ అయితయి’ అని అనౌన్స్ చేస్తూ.. అదెలా జరుగుతదో ఒక చిన్న సినిమా చూపించారు. ‘కాబట్టి, అందరూ ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి’ అని చెప్పారు. ఈ రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తే చాలా మంచిదనీ, గ్రామ ప్రజలకు ఇది ఎంతో ఉపయోగ పడుతదని పోలీసులు, సర్పంచ్ మాట్లాడారు. అంతటితో ఆ ప్రోగ్రాం ఒడ్సింది. అందరూ ఇళ్లకు నడుస్తుర్రు. తొవ్వంట వోంగ..“సూశినవాయే పద్దీ! ఊకే దాంట్లనే మూతివెడుతవ్! లేనిపోనియి ఒత్తితే ఏమైతదో సమజైందా?”“ఆ.. నా అకౌంట్ల లచ్చలు ఉన్నయ్ మరీ! వాళ్లు ఎత్కపోనీకి. ఇగ నువ్వేమో నోట్లకట్టలు జమ చేయవడితివి మరీ!” అనే వెటకారంగా..“సరే! జెర పైలం. ఎంతైనా ఈ ఫోను మా సెడ్డదే!? ఎప్పుడు ఏం కత వెడ్తదో!?” అనుకుంట ఇల్లు చేరిర్రు.
ఒకరోజు ఇంటికి మనిషిని తోలిండు పటేల్. “మల్లీ.. పటేల్ రమ్మన్నడు నడువ్!” అనంగనే.. కాదనకుండ వీడు వానెంట పోయిండు.“నమస్తే పటేలా!?” అనే ఎదురుగ నిలవడీ,ఆయన పక్కన ఊరి పెద్దమనుషులు కూసున్నరు. “హా! వచ్చినావ్రా మల్లిగా! ఔరా.. పైసల సంగతి ఏమాయెరా!? పంట అమ్మితివి. అప్పు కట్టబుద్ధి అయితలే? నాకేం పనీపాట లేదారా!? ఊకే.. నీ ఇంటికి తిర్గనీకి?”“మొన్నటి వానకు పూత రాలి ఏమంత పైకం రాలే! మీకు తెల్వనిదేమున్నది. ఈ కిత్తల తెంపింది అమ్మి కడుత పటేలా!” అన్నడు. “సరే గానీ.. ఔరా! నీ పెండ్లాం లవు సోకుల వడుకుంట ఫోన్ల డ్యాన్స్ లేస్తున్నది. దానికేమన్న ఖదరున్నాదిరా! బజాట్లకు ఇడిసినవ్? ఔరా.. మీకే ఉన్నాయిరా? మాకు లేవా ఫోన్లు! మొన్న ఊరి గ్రూపులకు రీలు పంపింది. ఊరందరికి సూపిస్తాదిరా.. దాని సోకులు. తీస్కున్న అప్పు కట్టనీకి శాతగాదు కనీ.. రీల్స్ గావాలే మీకు రీల్సూ..! అయినా మీ ఇజ్జతి మీ ఇష్టం! గవన్ని నాకు తెల్వది. మర్యాదగా పైసల్ కట్టు. ఈ ఎలచ్చన్లు ఒడ్సే దాంక చూస్త. లేకుంటే పొలంల టాక్టర్ దిగుతది బిడ్డా.. చూస్కోమల్ల!” అని గద్దించిండు పటేల్. అంత మందిల ఆయన అంటున్న మాటలకు తల్కాయ తీసేసినట్టు అయింది వానికి.గా అవమానంతోని పోతుంటే తొవ్వల వీని దోస్తులు.. “ఏంరో.. చూస్కుంటనే పోతున్నవ్! ఊళ్లే కనవడుడేలేదు. ఎప్పుడు గా బాయికాడనే పంటవ్!? ఊళ్లే ఏం జరుగుతుంది? ఏ సంగతి అర్సుకోవారా? సర్పంచ్ ఎలక్షన్లు పడ్డయి. నీకు పొలం-ఇల్లు.. ఇదే సోయా!? నలుగుట్ల తిర్గాలే, మాట్లాడాలే. నీకంటె మీ పొల్ల నయంరా.. ఊరంత రీల్స్ పంపి అందరి కంట వడుతుంది” అని నగుతుండ్రు.
వీని మొఖంల కోపం చూసి, పటేల్ తాన జరిగిన సంగతి వాని వెంట వచ్చిన మల్లయ్య చెప్తే.. “అరే! ఏమనుకోకురా. ఏదో పరాష్కానికి అన్నమేగానీ.. మాకు తెల్వది. గా పటేల్ గాని మగ్ర వొంచాల్నంటే.. మనందరం గూడి ఉపాయం జేద్దాం!” అన్నరు వాళ్లు. “ఈసారి ఎలక్షన్లకు మన రాజును దించాలే! పెద్ద సదువులే సదివిండు. మస్తు తెలివుంది. ఉజ్జోగం రాక ఎవుసం జేత్తాండు. వాన్నే పోటీకి నిలవెట్టాలే!” అని అనుకున్నరు.అది విన్నంక మల్లేష్ కోపం సల్లవడ్డది. ‘నన్ను, నా భార్యను నలుగుట్ల పల్సదనం చేసిన పటేల్ మీద ఈ రకంగా పగ తీసుకుంటా!’ అనుకొని వాళ్లతోని కలిసిండు.రాజు మొదాలు పటేల్ మీద పోటంటే మామూలు ముచ్చట కాదని భయపడ్డడు.“అరే.. ఏంగాదు. మేమంతా ఉన్నం. నువ్వు బుగులు పడకు. ఇంకెన్ని రోజులు ఇట్లనే ఉందాం. రాత్రి అందరినీ కూసోవెట్టి మాట్లాడుకుందాం. వాడు మనకు అప్పులిచ్చి, మిత్తీల మీద మిత్తీలు వసూలు జేసి, పిండి పిప్పి జేస్తుండు. ఇదంతా అధికారం వాని చేతిల ఉందనే కదా..! వాన్ని అడిగెటోడు లేడాని.. ఊరంతా ఇష్టమొచ్చినట్టు కట్టుబందు వెడుతుండు. పంచాయితీ నిధుల్ని మాయంజేసి పట్నంల ఇల్లు కొన్నడు. మనం ఇట్లనే ఉంటే.. ఎన్నడో ఊరినే అమ్మేస్తడు. ఈసారి వాడు ఏమిచ్చినా వద్దనకుంట తీసుకుందాం. కానీ ఓటు మాత్రం మనోనికే ఏసి గెలిపించుకుందాం. పోటీల గెలిచి మనమంటే ఏందో సూపుదాం!” అని ఆ రాత్రి జనాలను పోగుజేసి.. అందరూ తీర్మానించుకుని నామినేషన్ ఏపిచ్చిర్రు.
ఈ విషయం మెల్లెగ పటేల్ శెవిన పడ్డది. ‘సరే! వాడెట్ల గెలుస్తడో అదిగూడ సూద్దాం!’ అని రగిలిపోతుండు. ఇగ జోరుగా మొదలైంది ప్రచారం. కులాలు, వర్గాలు జట్లుగ విడిపోయిర్రు. ఏదైతే గదాయే అనుకున్నరు.. ఎలక్షన్ రోజు ఊరంత ఓటేయనీకి పోయిర్రు. పగటీలి ఒకటైతాంది. ఓటింగ్ నిమ్మళంగ ఒడిసింది. రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చాలైంది. మొదాలు మూడు రౌండ్లల్ల పటేల్‌దే పైచేయి. ఇటు గెలుపు మీద రాజుగాని ఆశలు పోతున్నయ్..! కానీ, నాలుగో రౌండుల అద్భుతం జరిగింది. ఉన్నట్టుండి రాజు మెజారిటీ అమాంతం పెరిగి.. పటేల్ ఓట్లను చీల్చుతాంది. ఆఖరి రౌండు.. నువ్వా? నేనా? అన్నంత పోటీ. చివరికి ఫలితం.. ‘మూడే మూడు ఓట్ల మెజార్టీతో.. రాజు గెలుపు!’ అంటూ మైకు కేకలు వెడుతాంది!
పటేల్ మొఖం కిందికేసుకొని పోయిండు. గెలిచిన ఆనందంల అందరూ సంబురాల్లో మునిగిపోయిర్రు. ఇదేమీ తెల్వని మల్లేష్.. బాయికాడ చేరి మల్ల మిర్ప చెట్లకు మందు కొడుతాండు.
ఆ రాత్రి పటేల్.. ఓడిపోయిన బాధల తన ఇంట్ల మద్దతుదారులతోటి కలిసి, ఓదార్పు మందు తాగుతా.. ఓటమి కారణాలు లెంకుతాండ్రు. మూడే ఓట్లతోని ఊళ్లె ఇజ్జత్ పాయెకదరా.. ఏమై ఉంటదానీ?“ఔరా! మొన్న మల్లిగాన్ని తిట్టినందుకు వాడు గా మాటలు మనసుల పెట్టుకొని, వానింట్ల ఓట్లు నాకేయ్యలేదేమో? ఔ.. ఏమంటవ్ రెడ్డి సాబ్?”“ఏమోనే! ఇయ్యాల రేపు ఎవల్ని నమ్మనీకి లేదు. ఏమో వాడు ఎటేసిండో మనకెట్ల తెలుస్తదే!?”ఇట్ల నడుస్తున్నది అక్కడ ముచ్చట.ఆ రాత్రి ఊరంతా నిద్రవోతున్నది. పద్మ మాత్రం ఎప్పటిలాగే ఫోన్లో రీల్స్ చూస్తాంది. దాంట్ల నవ్వులు, ఆటలు, పాటలు, బాధలు వస్తానే ఉన్నయ్. అప్పుడు తన వేలు ఒక రీల్ దగ్గర ఆగింది. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు వచ్చే ఆశను చూపిస్తూ, ఒక రీల్.. ‘మీరు ఎన్ని రోజులు పేదవారిగానే ఉంటారు? మా కంపెనీలో వెయ్యి పెడితే పదివేలు సంపాదించే ట్రిక్ కోసం ఇప్పుడే ఈ లింక్‌పై క్లిక్ చేసి.. మీ నెంబర్ పంపండి!’ అంటూ చూసేవారికి ఆశ లేపుతాండు.అది చూసి పద్మ ముఖం వెలిగి.. తన భర్త పడే కష్టం గుర్తుకు తెచ్చుకుంది. ‘ఒకసారి కొన్ని పైసలు పెట్టి సూద్దాం.
పైసల్ రెట్టింపై వచ్చాక.. తనకు సర్ప్రైజ్ ఇద్దాం!’ అనుకుంది.అలా ఆమె ఆ లింక్ ఓపెన్ చేసింది. అక్కడి నుంచి వచ్చిన ప్రతీ ప్రశ్నకు ఓకే బటన్ నొక్కింది. క్షణాల్లోనే ఫోన్‌కి మెసేజ్ వచ్చింది. తెరిచి చూస్తే.. ఫోన్లో ఉన్న డబ్బులు కనిపించకుండా పోయాయి. తను భయంతో నిద్రపోతున్న భర్తను లేపి మెసేజ్ చూపించింది.వాడు కండ్లు పెద్దగజేసీ.. అది చదివి ఒక్కసారిగా షాకయ్యాడు. ఏముందీ.. తన అకౌంట్లో దాచుకున్న డబ్బులు మొత్తం ఎవరికో బదిలీ అయ్యాయి. కోపంతో.. “మొన్నే చెప్పిన కదే నీకు.. ఇసొంటివి జరుగుతాయని..?”తనకేమీ తెలియదన్నట్టు మొఖం నేలకేసింది. ఇద్దరి మధ్య గొడవ. వాళ్ల అరుపులకు పక్కనే నిద్రపోతున్న తల్లి లేచి, ఏమైందని అడిగితే.. ఇద్దరి నోటా ఉలుకు పలుకు లేదు.తెల్లవారితే పటేల్ డబ్బులకు వస్తాడని భయం. ఎలక్షన్ విషయంలో శత్రుత్వం, తల్లి కంటిపరీక్ష చేయించలేకపోయిన బాధ. పంట నష్టపోయిన ఆవేదన. ఊరిలో రోజూ వినిపించే రీల్స్ మాటలు.. అన్నీ ఒకేసారి వాని కళ్ల ముందు తిరిగాయి.
తల్లికి ఏం జరిగిందో తెలియక.. “పొద్దుట మాట్లాడుకుందాం. మీరు పండుకోండ్రి” అని, మనువడిని పక్కన వేసుకుని నిద్రపోయింది. ఆ రాత్రి వానికి నిద్ర రాలేదు. ఆ చీకటి ఆలోచనలు వాన్ని వీడలేదు. అంతులేని కోపం. పద్మ.. పదేపదే ఫోన్ వైపు చూస్తున్నది. పోయిన డబ్బు తిరిగి వస్తుందేమోననీ..! కానీ, అదీ జరగని పని. ఇలాంటి లింక్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. కానీ, ఆమె ఆశపడింది. ఇప్పుడు ఏమైంది? పొద్దున పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేద్దామని భర్తతో చెప్పాలని ప్రయత్నించింది. వాడు వినే పరిస్థితిలో లేడు. ఓ మూలన బాధతో ఉన్నాడు. పద్మ మంచం మీద కూర్చుని.. అలాగే నిద్రలోకి జారుకుంది. తెల్లవారుతున్నది. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చాడు. తనకు చావే పరిష్కారం అనీ..! ఎవరితో ఏమీ చెప్పలేదు. చివరిసారిగా అందరినీ తనివితీరా చూసి.. దండెం మీది తువాలతో ఇంట్లో దూలానికి వేలాడాడు. ఊరికి విషయం తెలియదు. కానీ, పద్మకు మాత్రం తెలుసు. తన భర్తను చంపింది.. అప్పు కాదు, పరువు కాదు. తెలిసి కూడా ఫోన్లో ‘ఓకే’ అని నొక్కిన ఒక చిన్న లింక్ అనీ..
‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2026’లో తృతీయ బహుమతి రూ.10 వేలు పొందిన కథ.
-అశోక్ పోతరాజు
94929 13913