కాజీపేట, ఆగస్టు 8: బలార్ష-కాజీపేట రైల్వే జంక్షన్ సెక్షన్ మధ్యలోని ఉప్పల్-హసన్‌పర్తి రైల్వే స్టేషన్ల మధ్య ఓహెచ్ఈ (ఓవర్ హెడ్ ఎక్వింప్మెంట్) 25000 కేవీ ఓల్టేజ్ విద్యుత్ తెగి పోయింది. దీంతో బలార్ష నుంచి కాజీపేట రైల్వే జంక్షన్‌కు వస్తున్న కాజీపేట ఎక్స్‌ప్రెస్ రైలు హసన్‌పర్తి రైల్వే స్టేషన్ శివారులో దాదాపు గంటన్నర పాటు నిలిచి పోయింది. గమనించిన డ్రైవర్లు సెక్షన్లో రైల్వే ఓహెచ్ఈ విద్యుత్ వైరు తెగిపోయిన విషయాన్ని రైల్వే ఉన్నతాధికారులు, స్థానిక అధికారులకు సమాచారం చేరవేశారు.
సెక్షన్లో నిలిచిపోయిన రైలు ఎంతకు కదులక పోడంతో ప్రయాణికులు అనేక మంది రైలు దిగి రైలు పట్టాల వెంట నడుస్తూ రోడ్డు మార్గం చేరుకుని వారి గమ్యస్థానాలకు చేరుకున్నారు. రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాలతో కాజీపేట రైల్వే టీఆర్డీ/ఓహెచ్ఈ కార్మికులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు చేపట్టారు. గంటన్నర అనంతరం సెక్షన్లో నిలిచిపోయిన రైలు తిరిగి కాజీపేట జంక్షన్‌కు చేరుకుంది. సెక్షన్లో ఓహెచ్ఈ విద్యుత్ వైర్ తెగిపోవడంతో బలార్ష-కాజీపేట సెక్షన్లో వరంగల్ రైల్వే స్టేషన్ మీదుగా నడిచే పలు రైళ్లకు కొంత అంతరాయం కలిగిందని అధికారులు చెప్పారు.