హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ మరో రైతు వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకున్నది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయిన రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా అందించే రైతుబీమా పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఎనిమిదేండ్లుగా కొనసాగుతున్న ఈ పథకం ఈ నెల 14తో ముగియనున్నది. ఈ పథకాన్ని రద్దు చేయాలన్న సర్కార్ నిర్ణయంతో ఇకపై ఎల్ఐసీకి ప్రీమియం చెల్లింపులను నిలిపివేయనున్నది. దీంతో రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవడం, పరిహారం అందించడం బంద్ కానున్నది. ఈ పథకం రద్దుతో రైతు మరణిస్తే ఆ రైతు కుటుంబాలకు ఇచ్చే రూ.5 లక్షల పరిహారం ఇకపై అందదు. కాంగ్రెస్ కఠిన నిర్ణయంతో వేలాది మంది రైతుల కుటుంబాలు మళ్లీ ఆర్థిక ఇబ్బందుల సుడిగుండంలోకి జారుకొని రోడ్డున పడే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రైతుల కోసం ప్రతియేటా కేవలం రూ.1,400 కోట్లు ఖర్చు చేయలేక పథకాన్ని రద్దు చేస్తుండడం గమనార్హం.
వివిధ కారణాలతో రైతులు అకాల మరణం చెందితే వారి కుటుంబాలు ఓవైపు అప్పులు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవి. ఇలాంటి పరిస్థితుల్లో వారి ఆర్థిక సమస్యలను పరిష్కరించి, భరోసా కల్పించేందుకుగాను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2018లో రైతుబీమా పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ప్రభుత్వం, రైతులు ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కానీ, నాటి సీఎం కేసీఆర్.. రైతులపై భారం మోపొద్దనే ఉద్దేశంతో రైతులు చెల్లించాల్సిన ప్రీమియాన్ని సైతం ప్రభుత్వమే చెల్లించేలా ఏర్పాట్లుచేశారు. ఇలా ప్రతియేటా ఆగస్టు 14వ తేదీన ఎల్ఐసీకి ప్రభుత్వం నుంచి తన వాటా, రైతుల వాటా కింద ప్రీమియం డబ్బులు చెల్లించేది. ఈ ప్రీమియం డబ్బులు చెల్లిస్తేనే పథకం అమలవుతుంది. ఇందులో భాగంగానే రైతుల సంఖ్యను బట్టి ఎల్ఐసీకి సుమారు రూ.1,400 కోట్లు చెల్లించాల్సి వచ్చేది. ప్రస్తుతం ఈ పథకాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఎల్ఐసీకి ప్రీమియం చెల్లింపులను నిలిపివేసినట్టుగా తెలిసింది. ఇందుకు అవసరమైన నిధులను కూడా ఈ బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించలేదు. దీంతో ఈ ఏడాది ఆరంభంలోనే రైతుబీమా పథకాన్ని రద్దు చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకోవడం గమనార్హం.
కేసీఆర్ అమలు చేసిన రైతుబీమా పథకంలో భాగంగా రైతులు ఏ కారణంతో మరణించినప్పటికీ ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఎల్ఐసీ ద్వారా చెల్లించేలా ఏర్పాటుచేశారు. అయితే, ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ రైతుబీమా పథకాన్ని రద్దు చేయాలని నిర్ణయించడంతో ఇకపై రైతులు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందదు. ఎల్ఐసీకి ప్రీమియం చెల్లింపులు నిలిపివేయడంతో ఈ పథకం కోసం ఇకపై దరఖాస్తులు కూడా స్వీకరించరు. రైతుబీమా రద్దుతో రైతు కుటుంబాలకు మళ్లీ కష్టాలు మొదలుకానున్నాయి. మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
రోడ్డు ప్రమాదాలు, అనారోగ్యంతోపాటు వివిధ కారణాలతో రైతులు అకాల మరణం పొందడం, ఆ తర్వాత పెద్ద దిక్కును కోల్పోయిన వారి కుటుంబాలు ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులను చూసి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చలించిపోయారు. వారికి ఆర్థిక భరోసా కల్పించి ఇబ్బందులను తొలగించాలన్న సదుద్దేశంతో దేశంలో మరే రాష్ట్రంలోనూ లేని విధంగా 2018లో రైతుబీమా పథకానికి శ్రీకారం చుట్టారు. 18-59 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండి, తమ పేరుపై ఎంతో కొంత భూమి కలిగిన రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. ఈ పథకంలో నమోదైన రైతు లు మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందించేలా ఏర్పాట్లుచేశారు. పథకం అమలుకు ప్రతియేటా రూ.1,400 కోట్ల భారాన్ని భరించారు. ఇప్పుడు పథకాన్నే రద్దు చేస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రైతుబీమా పథకం కింద బీఆర్ఎస్ హయాంలో 2018-19 నుంచి 2023-24 వరకు వివిధ కారణాలతో మరణించిన 1,33,601 మంది రైతులకు పరిహారంగా రూ.6,680.05 కోట్లు చెల్లించడం గమనార్హం. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబీమా కోసం ఎల్ఐసీకి రూ.6,860 కోట్ల ప్రీమియం చెల్లించింది. ఇక కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేండ్లలో రూ.2,792.89 కోట్లు ఎల్ఐసీకి చెల్లించింది. తద్వారా 43,483 మంది మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం అందించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరేండ్లుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతుబీమా పథకం కోసం ప్రీమియం చెల్లించింది. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రీమియం చెల్లింపుల్లో కోతలు పెడుతూ వచ్చింది. ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించకపోవడంతో పలుమార్లు రైతులకు పరిహారం చెల్లింపులను నిలిపివేసింది. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు, మీడియా లేవనెత్తడంతో ప్రభుత్వం ఎల్ఐసీకి పరిహారం చెల్లించింది. ఇప్పుడు పథకాన్నే రద్దు చేస్తుంది.
రైతుబీమాను రద్దు చేయాలనే సర్కార్ నిర్ణయంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. రైతు అకాల మరణం చెందితే ఆ కుటుంబాలకు ఈ పథకం ఎంతో అండగా ఉండేదని, ఇప్పుడు ఆ భరోసా కరువుకానుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతున్నది. రైతుబీమా పథకం కింద అందే రూ.5 లక్షల పరిహారం ఆ కుటుంబానికి ఎంతో మేలు చేసేదని, ఆ సొమ్ముతో అప్పులు తీర్చడమో, పిల్లల్ని చదివించడమో, వారి పెండ్లిళ్లు చేయడమో చేసేవారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఉన్నపలంగా రైతుబీమా పథకాన్ని రద్దు చేయడంతో ఆ భరోసా కరువుకానుందనే ఆందోళనలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. కుటుంబ పెద్దను కోల్పోయామనే బాధతోపాటు మళ్లీ అప్పులు, ఆర్థిక ఇబ్బందులు వెంటాడం ఖాయమని తెలుస్తున్నది. ఇందిరమ్మ కుటుంబ బీమా మాటున రైతుబీమా పథకాన్ని రద్దు చేయడం ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతులపై ప్రేమ ఉంటే ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంతోపాటు రైతుబీమా పథకాన్ని కూడా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. రైతు సర్కార్ అని చెప్పుకొంటున్న కాంగ్రెస్, రైతుల కోసం సంవత్సరానికి రూ. 1,400 కోట్లు ఖర్చు చేయలేదా అని ప్రశ్నిస్తున్నారు.
