ఇల్లెందు, ఆగస్టు 5 : రైతులకు యూరియా కొరతను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇల్లెందు వ్యవసాయ శాఖ ఏడీఏ కార్యాలయం ఎదుట సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో గత నెల రోజులుగా యూరియా కొరతతో రైతులు రేయనక, పగలనక యూరియా కోసం సొసైటీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా కొరతను తీర్చలేకపోతున్నాయన్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసి అయిన తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులకు కావాల్సిన యూరియా అందించుటలో విఫలమయ్యారని ఆరోపించారు. అలాగే స్థానిక శాసనసభ్యులు కోరం కనకయ్య ప్రత్యేక దృష్టి సారించి రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తుపాకుల నాగేశ్వరరావు, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షుడు కొక్కు సారంగపాణి, ప్రధాన కార్యదర్శి జే. సీతారాములు, నాయకులు పరిశిక రవి, పూణ్యం రంగయ్య, రమేష్, కల్తీ వెంకటేశ్వర్లు, రామచందర్, చిరంజీవి, వినోద్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.