– స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్
జూలూరుపాడు, జూన్ 06 : సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ప్రజాపంథా అనుబంధ అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIUKS) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం జూలూరుపాడు మండల తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రైతు సమస్యల పరిష్కారం, స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలు, కనీస మద్దతు ధరల పెంపు తదితర డిమాండ్లతో ఈ ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ప్రజాపంథా జిల్లా నాయకుడు జాటోత్ కృష్ణ, అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర నాయకుడు బానోతు ధర్మ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రంలోని ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. 2014లో అధికారంలోకి రాకముందు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల మేరకు సమగ్ర వ్యవసాయ ఉత్పత్తి ఖర్చు ఆధారంగా కనీస మద్దతు ధరలను నిర్ణయిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటివరకు ఆ హామీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు.
2026-27 ఖరీఫ్ సీజన్‌కు 14 పంటల ఎంఎస్పీలను పెంచినట్లు ప్రకటించినప్పటికీ, వాస్తవ ఉత్పత్తి ఖర్చులను పరిగణనలోకి తీసుకోకుండా నూతన విధానాన్ని అనుసరించడం వల్ల రైతులకు న్యాయం జరగడం లేదన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల వేతనాలు, డీజిల్, విద్యుత్, సాగునీటి ఖర్చులు ఏడాదికేడాది పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం ప్రకటిస్తున్న మద్దతు ధరలు రైతుల పెట్టుబడులకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పంటలను మార్కెట్లకు తీసుకెళ్లిన రైతులు ఎంఎస్పీ కంటే తక్కువ ధరలకు మధ్యవర్తులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. వరి, మొక్కజొన్న, పత్తి, కంది తదితర పంటలకు సంబంధించి కొనుగోలు కేంద్రాలను సకాలంలో ప్రారంభించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించారు.
రైతులు ఆందోళనలకు దిగిన తర్వాత మాత్రమే కొనుగోలు కేంద్రాలు తెరవడం దురదృష్టకరమన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్య రైతు సంఘం, సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ ప్రజాపంథా నాయకులు లింగాల వీరభద్రం, జాటోత్ నారసింహ, పైడా వెంకటేశ్వర్లు, తాటి నరసింహారావు, తెల్లం కృష్ణయ్య, మలకం సతీష్, బానోతు లాలు, భూక్య శకురు, బాదావత్ బోజ్జా, కోటయ్య, పి. పద్మావతి, నాగ విజయలక్ష్మి, రామనాథం, వెంకటమ్మ పాల్గొన్నారు.