– అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులు
కారేపల్లి, ఆగస్టు 05 : ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల పరిధిలోని ఎర్రబోడు గ్రామ కోయగుంపుకు చెందిన పాయం సాయి(20) ఈ నెల 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు ముందుగా ఖమ్మం ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. గత మూడు రోజులుగా హైదరాబాద్‌లో గల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిని వైద్యులు బుధవారం బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. దీంతో చిన్న వయసులోనే అకాల మృతి చెందిన తమ కుమారుడిని చిరంజీవిగా చూడాలనే ఆకాంక్షతో అవయవాలను దానం చేస్తున్నట్లు తల్లిదండ్రులు ప్రకటించారు. ఉస్మానియా, స్టార్, యశోద ఆస్పత్రుల్లో అవసరమైన బాధితులకు కుటుంబ సభ్యుల అంగీకారంతో సాయి అవయవాలను ముగ్గురికి దానం చేసేందుకు ఆస్పత్రి వర్గాలు ఏర్పాట్లు చేశాయి.