కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 24 : కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో మృతిచెందిన వారి కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కొత్తగూడెం జర్నలిస్టులు కోరారు. పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులను నిరసిస్తూ గురువారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో వారు నిరసన ప్రదర్శన చేశారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ.. సుందరమైన కశ్మీర్లో రక్తపుటేరులు పారించిన ఉగ్రవాదులను క్షమించవద్దన్నారు.
దేశంలో అలజడులు సృష్టించి భయానక వాతావరణాన్ని, మారణహోమాన్ని సృష్టించిన పాకిస్తాన్ టెర్రరిస్టులను వదలవద్దని, వారికి తగిన గుణపాఠం చెప్పాలని కేంద్రాన్ని కోరారు. ఇటువంటి సమయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలన్నారు. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ చర్యలను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాలని పేర్కొన్నారు.