AP EAPCET : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET ) దరఖాస్తులు సమర్పించేందుకు గడువును పొడిగిస్తున్నట్లు కన్వీనర్ ఎన్ మోహన్రావు (N Mohan Rao) వెల్లడించారు. ఆలస్యరుసుము లేకుండా ఆన్లైన్ (Online) లో మార్చి 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.
అపరాధ రుసుము రూ.వెయ్యితో మార్చి 21, రూ.2 వేలతో మార్చి 25, రూ.4 వేలతో మార్చి 30, రూ.10 వేలతో ఏప్రిల్ 3 వరకు అవకాశం కల్పించారు. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఏప్రిల్ 4-6 వరకు అవకాశం కల్పించారు. పరీక్షల నిర్వహణ తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలిపారు.
ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు మే 12 నుంచి 15 వరకు, అనంతరం 18న నిర్వహిస్తారు. వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు మే 19, 20 తేదీల్లో ఉంటాయి. ప్రాథమిక ‘కీ’ మే 23 న విడుదల చేసి, 25 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఫలితాలు జూన్ 1న ప్రకటిస్తారు.