(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ) : డీలిమిటేషన్ ప్రక్రియపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నదని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ విమర్శించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డి.. బీజేపీ సర్కార్ డీలిమిటేషన్ ప్రక్రియకు మద్దతిచ్చారని గుర్తుచేశారు. సొంత పార్టీ నాయకుడు బీజేపీ డీలిమిటేషన్‌కు మద్దతిస్తుంటే తమిళనాడులో మాత్రం కాంగ్రెస్ డ్రామాలకు తెరతీస్తున్నదని మండిపడ్డారు. ముందు సీఎం రేవంత్ వైఖరిని కాంగ్రెస్ పెద్దలు ప్రశ్నించాలని హితవు పలికారు. ఈమేరకు ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్‌లో మారన్ నిప్పులు చెరిగారు.
డీలిమిటేషన్‌పై చర్చించడానికి తమిళనాడులోని విజయ్ ప్రభుత్వం శనివారం సమావేశం నిర్వహించింది. ఈ భేటీని డీఎంకే బాయ్‌కాట్ చేయడంతో కాంగ్రెస్ విమర్శలకు పదును పెట్టింది. దీంతో దయానిధి కాంగ్రెస్‌పై ఎదురుదాడి చేశారు. డీలిమిటేషన్ వద్దని కాంగ్రెస్ తమిళనాడులోనే ఎందుకు డ్రామాకు తెరతీసింది?అని ప్రశ్నించారు. ఇక్కడ వద్దంటున్న కాంగ్రెస్.. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఎందుకు మౌనంగా ఉంటున్నదని ప్రశ్నించారు. ఈ మేరకు డీలిమిటేషన్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యల పత్రికా క్లిప్పింగ్‌ను మారన్ పోస్ట్ చేశారు.