న్యూఢిల్లీ: పాకిస్థాన్, సౌదీ అరేబియా, తుర్కియే ఇటీవల మక్కాలో ఒక నూతన రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి. ‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’గా పిలుస్తున్న ఈ ఒప్పందం ‘నాటో’ తరహాలోనే ఒక సభ్యదేశంపై దాడి జరిగితే, అది మూడు దేశాలపై జరిగిన దాడిగా పరిగణిస్తుంది. అమెరికా భద్రతా హామీలపై నమ్మకం సడలుతున్న తరుణంలో పశ్చిమాసియాలో ఒక సరికొత్త ప్రాంతీయ భద్రతా కూటమి నిర్మాణానికి ఇది పునాదిగా మారుతున్నది. ఈ కూటమిలో మరిన్ని ఇస్లామిక్ దేశాలను చేర్చుకోవాలని వ్యవస్థాపకులు భావిస్తున్నారు.
ఆఫ్రికాలో బలమైన సైన్యం కలిగిన ఈజిప్ట్‌ను తదుపరి సభ్యదేశంగా చేర్చుకొనేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఖతార్, కువైట్, జోర్డాన్, అజర్బైజాన్, సిరియా దేశాలు కూడా ఈ కూటమిలో చేరే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకున్న కూటమి కాదని, కేవలం రక్షణాత్మక ఏర్పాటేనని సభ్య దేశాలు చెబుతున్నాయి.