– రూ.48 లక్షలు బకాయి
– తొమ్మిది వారాలుగా ఎదురుచూపులు
– కార్యాలయాల చుట్టూ కూలీల ప్రదక్షిణలు
జూలూరుపాడు, మార్చి 24 : ఉపాధి హామీ పథకం.. పేదవాడికి ఆసరాగా నిలవాల్సిన ఈ పథకం ఇప్పుడు కూలీల పాలిట శాపంగా మారుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని సుమారు 24 గ్రామ పంచాయతీల పరిధిలో 10,368 మందికి జాబ్ కార్డులు ఉండగా మొత్తం 21,695 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. వీరిలో సుమారు 800 మందికి పైగా ఉపాధి పనులకు వెళ్తుండగా. ప్రస్తుతం పనులకు వెళ్తున్న వారికి గత రెండు నెలలుగా నయాపైసా అందడం లేదు. నియమం ప్రకారం ప్రతి వారం కూలీల ఖాతాల్లో డబ్బులు జమ కావాల్సి ఉండగా, గత తొమ్మిది వారాలుగా ప్రభుత్వం నుండి ఎలాంటి చెల్లింపులు జరగలేదు. ఒక్క జూలూరుపాడు మండలంలోనే సుమారు రూ.48 లక్షల మేర వేతనాలు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికంగా వ్యవసాయ పనులు లేక, ఉపాధి పనులనే నమ్ముకున్న కూలీలు ఇప్పుడు బ్యాంకులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారుల నుండి స్పష్టమైన హామీ లభించడం లేదు.
ఉపాధి కూలీలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ “మండుటెండలో కష్టపడుతున్నా ఫలితం దక్కడం లేదు. ఇంట్లో పూట గడవడం కష్టమవుతోంది” అని వాపోతున్నారు. రూ.48 లక్షల బకాయిలు ఎప్పుడు విడుదలవుతాయో, కూలీల కష్టానికి ఫలితం ఎప్పుడు దక్కుతుందో వేచి చూడాలి. ఈ వ్యవహారంపై ఈజీఎస్ మండల ఏపీఓ రామారావు స్పందిస్తూ నిధుల విడుదల ప్రభుత్వ స్థాయిలోనే ఆగిపోయిందని, సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. త్వరలోనే బకాయిలు చెల్లిస్తామని, కూలీలు ఆందోళన చెందవద్దని ఆయన తెలిపారు.