(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : పాలనా వైఫల్యం కారణంగా కాంగ్రెస్‌పాలిత రాష్ర్టాల ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. అధికారంలోకి వచ్చేందుకు గ్యారెంటీల పేరిట అడ్డగోలు హామీలు ఇచ్చిన ఆ పార్టీ.. ఇప్పుడు ఆ వాగ్దానాలను అమలు చేయలేక చేతులెత్తేస్తున్నది. నిన్న ‘వితంతు ట్యాక్స్’ పేరిట హిమాచల్ సర్కార్ విమర్శలపాలవ్వగా, నేడు ‘వాకిలి ట్యాక్స్’ పేరిట కర్ణాటక ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురైంది.
ఇంటి ముందున్న వాకిలిలో కారు పార్కింగ్ చేస్తే, ఏడాదికి గరిష్ఠంగా రూ. 25 వేల పన్ను చెల్లించాలని (నెలకు రూ. 2 వేలకు పైగా) కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఈ మేరకు గ్రేటర్ బెంగళూరు ఏరియా (పార్కింగ్) రూల్స్, 2026ను తాజాగా తీసుకొచ్చింది. ఇంటి పన్ను, నీటి పన్ను, విద్యుత్తు చార్జీలు ఇలా అన్ని రకాల రుసుములు క్రమంగా చెల్లించినవారికే ఈ ట్యాక్స్‌తో కూడిన పార్కింగ్ అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.
డీకే ప్రభుత్వ నిర్ణయంపై బెంగళూరు నగరవాసులు మండిపడుతున్నారు. కాలనీల్లోని ఇండ్లల్లో ఇంటి ముందున్న వాకిలిలో కాకుండా కార్లను ఇంకా ఎక్కడ పార్క్ చేస్తామంటూ నిలదీస్తున్నారు. ఖజానాను నింపుకోవడమే ధ్యేయంగా ప్రజలపై కాంగ్రెస్ ఎడాపెడా పన్నులను విధిస్తున్నదని ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఐదు గ్యారెంటీలను ఇప్పటికీ పూర్తిగా అమలు చేయట్లేదు. అధికారంలోకి రాగానే మద్యంపై 20 శాతం, బీరుపై 10 శాతం పన్నును పెంచిన ప్రభుత్వం.. ఆ తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లను రూ. 3 మేర పెంచింది. గైడెన్స్ వ్యాల్యూ ట్యాక్స్‌ను 15 శాతం నుంచి 30 శాతానికి పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈవీలపై లైఫ్‌టైమ్ ట్యాక్స్ అని, కొత్తగా రిజిష్టర్ అయిన వాహనాలపై అదనపు సెస్ అంటూ వాత పెట్టింది. ఇక, ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, ఆలయాల్లో సర్వీస్ ఫీజు, వాటర్ చార్జీలు మొదలు పాల ధర, బస్సు, మెట్రో, క్యాబ్ చార్జీలు ఇలా అన్నింటినీ అమాంతం పెంచేసింది.

కర్ణాటకలోనే కాదు.. హిమాచల్‌లోనూ అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాక్స్ వాతకు దిగింది. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి విడో (వితంతువు), ఆర్ఫన్ (అనాథ)ల పేరిట ఓ సెస్‌ను హిమాచల్‌లోని సుఖ్విందర్ సింగ్ సుఖు ప్రభుత్వం ఇటీవల తెరమీదకు తీసుకొచ్చింది. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై తొలుత 60 పైసల చొప్పున విధిస్తున్నట్టు ప్రకటించింది. పెరిగిన రేట్లు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయని తెలిపింది. అయితే, విడో సెస్ పేరిట రానున్న కాలంలో పెట్రోల్‌పై రూ. 5 వరకూ వడ్డింపు ఉండొచ్చని సంబంధితవర్గాలు తెలిపాయి. అయితే, సుఖు సర్కారు తీసుకొన్న నిర్ణయంపై పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ మండిపడింది.
గ్యారెంటీలు, హామీలతో హిమాచల్, కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని నెరవేర్చడానికి ఆయా రాష్ర్టాలను అప్పుల కుప్పగా మారుస్తున్నది. హిమాచల్ అప్పు ఇప్పుడు రూ.1,04,000 కోట్లకు చేరింది. కర్ణాటక రాష్ట్ర మొత్తం రుణం రూ. 8.24 లక్షల కోట్లకు చేరినట్టు గణాంకాల్లో తేలింది. కర్ణాటకలో ఆరు గ్యారెంటీలను ఇక్కడ కూడా అమలు చేస్తామని తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలు కోసం కిందా మీద పడుతున్నది. కొద్దిపాటి సంక్షేమ పథకాలను అప్పులతోనే రేవంత్ ప్రభుత్వం నెట్టుకొస్తున్నది. రెండున్నరేండ్లలోనే మొత్తంగా తెలంగాణ అప్పు రూ. 8.84 లక్షల కోట్లకు చేరింది. ఇటీవల కేరళలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కూటమి సర్కారు కూడా అప్పులబాటలో నడుస్తున్నట్టు ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నారు.