Electric wires | జూలూరుపాడు, ఫిబ్రవరి 12 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలోని కాకర్ల గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీలో ఇండ్లపై విద్యుత్ లైన్లు యమపాశాల్లా వేలాడుతూ ప్రమాదభరితంగా మారాయి. ఏ క్షణంలో ప్రమాదం ఎటు నుంచి ఎటు పొంచుకొని వస్తుందో తెలియక కాలనీవాసులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. విద్యుత్ వైర్లను వెదురుగడలకు కట్టి సర్కస్ పీట్లను తలపించేలా వేలాడదీశారు.
ఇండ్ల ముందు సైతం చేతికి అందే ఎత్తులో విద్యుత్ వైర్లు వేలాడుతూ ప్రమాద భరితంగా మారడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నట్లు కాలనీవాసులు పేర్కొంటున్నారు. స్లాబులపై వేలాడుతున్న వైర్లు ఎప్పుడు మీద పడతాయో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గాలివీస్తే వైర్లు కలిసి వరిగడ్డివాములు పూరి గుడిసెలు సైతం అగ్నికి ఆహుతి కావడంతో పాటు పలు ప్రమాదాలు జరిగినా అధికారులు స్పందించడం లేదని పేర్కొన్నారు.
భయం గుప్పెట్లో..
కాలనీలోని ఇండ్లు, స్లాబులపై వేలాడుతున్న విద్యుత్ వైర్లు మార్చాలని అనేకమార్లు అధికారులకు విన్నవించామని స్తంభాలను మార్చేందుకు అవసరమైన నిధులు మీరే సమకూర్చుకోవాలని పేర్కొనడంతో ఆర్థిక స్తోమత లేక మిన్న కుండామన్నారు. దీంతో భయం గుప్పెట్లో కాలం వెళ్లదీస్తున్నట్టు కాలనీవాసులు తెలిపారు. విద్యుత్ వైర్లు, స్తంభాలకు పిచ్చి తీగలు సోకి ప్రమాద భరితంగా మారాయని విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం
Mythological Drama Competitions | పౌరాణిక నాటక పోటీలకు బ్రోచర్ ఆవిష్కరణ
Maha Kumbh Mela | మాఘ పౌర్ణమి.. 1.83 కోట్ల మంది పుణ్యస్నానాలు