హైదరాబాద్ : మూసీ (Musi River) పరిసరాల్లో మళ్ళీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మళ్లీ జేసీబీ (JCBs) లు మూసి పరిసరాల్లోకి ప్రవేశించడంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. కూల్చివేతల ప్రక్రియ మళ్ళీ మొదలుపెట్టారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిమాయత్ నగర్ (Himayath Nagar) మండలంలోని శంకర్ నగర్, మూసా నగర్, వినాయక్ నగర్లో అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. గతంలో అక్కడ ఇండ్లను కూల్చారు. ఆ సమయంలో జనం వ్యతిరేకించారు. పోలీసుల సహాయంతో బలవంతంగా వారి నిర్మాణాలను కూల్చారంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఆ సమయంలో ఆ నిర్మాణాల గోడలు అలాగే ఉన్నాయి. వాటిని పూర్తిగా తొలగించేందుకు జేసీబీలు మళ్లీ బుధవారం రంగంలోకి దిగాయి. దాంతో మళ్లీ కూల్చివేతల ప్రక్రియ తెరపైకి వచ్చిందని స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులు స్పందిస్తూ ఇండ్లకు సంబంధించి మార్క్ చేసి, రిపోర్టు ఇచ్చేశామని మిగతా ప్రక్రియ అంతా మూసి రివర్ ఫ్రంట్ అధికారులు చూసుకుంటారని తెలిపారు.