Maha Kumbh Mela | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు (Maha Kumbh Mela) భక్తుల (devotees) తాకిడి పెరిగింది. ఇవాళ మాఘ పౌర్ణమి (Magh Purnima) సందర్భంగా పుణ్యస్నానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమంలో బుధవారం తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 2 గంటల వరకూ ఏకంగా 1.83 కోట్ల మంది (కోటి 83 లక్షల మంది) భక్తులు పవిత్ర స్నానాలు చేసినట్లు యూపీ అధికారులు తెలిపారు.
మాఘ పౌర్ణమి స్నానాలు ఇవాళ సాయంత్రం 7:22 వరకూ కొనసాగనున్నాయి. దాదాపు 2 నుంచి 3 కోట్ల మంది ఇవాళ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కుంభమేళా ప్రాంతంలో దాదాపు 15 కిలోమీటర్ల మేర రద్దీ నెలకొంది. భక్తులపై యూపీ సర్కార్ హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. 25 క్వింటాళ్ల పూలను భక్తులపై వెదజల్లారు.
మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా యూపీ సర్కార్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. గత నెల మౌనీ అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఇవాళ మహాకుంభమేళాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మాఘ పూర్ణిమ మంగళవారం సాయంత్రం 6.55 గంటలకు ప్రారంభమై బుధవారం రాత్రి 7.22 గంటలకు ముగుస్తుంది. మంగళవారం తెల్లవారుజాము 4 నుంచి మేళా ప్రాంతాన్ని ‘నో వెహికిల్ జోన్’గా అధికారులు ప్రకటించారు. అత్యవసర, నిత్యావసర సర్వీసులకు చెందిన వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. దీంతో యాత్రికులు సంగమం వద్దకు దాదాపు 8 నుంచి 10 కిలోమీటర్ల మేర నడవాల్సి వస్తోంది. మరోవైపు ఫిబ్రవరి 8వ తేదీ నుంచి మహా కుంభమేళాకు వెళ్లే దారులన్నీ 300 కిలోమీటర్ల దూరం వరకు వాహనాలతో కిక్కిరిసిపోయాయి.
కాగా, పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13వ తేదీన మహాకుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 శివరాత్రి వరకూ ఈ కుంభమేళా కొనసాగనుంది. దాదాపు 45 రోజులపాటూ జరిగే ఈ మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 55 కోట్ల మంది భక్తులు వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు తగ్గట్లు ఏర్పాటు చేసింది. ఇక ఇప్పటివరకు 46.25 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు.
Also Read..
Guillain Barre Syndrome | మహారాష్ట్రలో 172కు పెరిగిన జీబీఎస్ కేసులు.. ముంబైలో తొలి మరణం
Pariksha Pe Charcha | అప్పుడు బతకాలనుకోలేదు.. అమ్మను పట్టుకుని ఏడ్చేశా : దీపికా పదుకొణె