Pariksha Pe Charcha | విద్యార్థుల్లో (Students) పరీక్షల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఏటా ప్రత్యేకంగా ‘పరీక్షా పే చర్చ’ (Pariksha Pe Charcha) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా 8వ ఎడిషన్ పరీక్షా పే (Pariksha Pe Charcha 2025) చర్చ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ నటి దీపికా పదుకొణె (Deepika Padukone) పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్‌ను దీపిక ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అందులో మానసిక ఆరోగ్యంపై (depression battle) స్టూడెంట్స్‌కు కీలక సూచనలు చేశారు.
చదువుకునే రోజుల్లో చాలా ఒత్తిడి ఉంటుందని దీపిక చెప్పారు. ఎన్నో భయాలు కూడా ఉంటాయని వివరించారు. ఆ భయాలన్నింటినీ అధిగమించి ముందుకు సాగాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు సమస్యలను లోలోపల అణచిపెట్టుకోకూడదని.. వాటిని బయటకు చెప్పాలని సూచించారు. సమస్యలను తల్లిదండ్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులతో పంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా తాను మానసిక ఆరోగ్యానికి గురైన రోజులను కూడా గుర్తు చేసుకున్నారు.
‘నేను స్కూల్ చదువుల నుంచి క్రీడల వైపుకు.. ఆ తర్వాత మోడలింగ్.. చివరికి సినిమాలవైపు.. ఇలా నా జీవితంలో ఎన్నో మార్పులను చూశాను. అప్పుడు నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ముందుకెళ్లా. 2014 వరకు అంతా బాగానే ఉంది. కానీ, ఆ తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయా. నేను డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు అర్థమైంది. ఇది కంటికి కనిపించదు. కానీ మనిషిని తీవ్రంగా దెబ్బతీస్తుంది. నేను ముంబయిలో ఒంటరిగా ఉండటం వల్ల ఈ సమస్యను చాలాకాలం పాటు ఎవరితోనూ పంచుకోలేదు. ఓ సారి మా అమ్మ నన్ను చూసేందుకు ముంబైకి వచ్చింది. తిరిగి బెంగళూరు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయా. ఆ రోజు తొలిసారి నా బాధను అమ్మతో చెప్పుకున్నా. ‘నేను నిస్సహాయ స్థితిలో ఉన్నా. నాకు జీవితంపై ఆశ లేదు. బతకాలని లేదు’ అంటూ ఆమెను పట్టుకుని బాగా ఏడ్చేశా. అప్పుడు ఆమె నాకు ఓ సలహా ఇచ్చింది. మానసిక వైద్య నిపుణుడి వద్దకు వెళ్లమని సూచించింది’ అని దీపిక ఆ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.
మన దేశంలో మానసిక ఆరోగ్యం ప్రతికూల అంశాన్నే కలిగి ఉంటుందని దీపిక అన్నారు. ‘ఎన్నో సమస్యలతో పోరాడుతున్న వారు మన చుట్టూనే ఉంటారు. కానీ, ఆ విషయం మనకు తెలియదు. ఎందుంటే వాళ్లు బయటకు సంతోషంగా, సాధారణంగా కనిపిస్తారు. దాని గురించి ఎవరూ బయటకు మాట్లాడరు. నేను నా సమస్యను బయటకు చెప్పిన వెంటనే మనసు చాలా తేలికగా అనిపించింది. ఆందోళన, ఒత్తిడి, నిరాశ అనేవి ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఎదుర్కొనేవే. ఇవి మనిషిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అందుకే వాటి గురించి భయపడొద్దు. పంచుకుంటేనే మనలోని భారం దిగిపోతుంది. సమస్యను అణచిపెట్టుకొని బాధపడొద్దు. ధైర్యంగా బయటకు చెప్పాలి’ అని దీపిక విద్యార్థులకు సూచించారు.
Also Read..