Worlds Most Corrupt Country | ప్రపంచంలోనే అత్యంత అవినీతి గల దేశాల (Worlds Most Corrupt Country) జాబితా విడుదలైంది. ఈ జాబితాలో భారత్ స్థానం మరోసారి దిగజారింది. 2024కు సంబంధించి కరప్షన్ పెర్సెప్షన్స్ ఇండెక్స్ (Corruption Perceptions Index)ను ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ (Transparency International) తాజాగా విడుదల చేసింది. మొత్తం 180 దేశాలకు సంబంధించిన అవినీతి సూచీని విడుదల చేసింది. ఈ సూచీలో భారత్ 96వ స్థానంలో నిలిచింది.
ఏటా నిపుణులు, వ్యాపారవేత్తల దృష్టిలో ఆయా దేశాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందన్న అంచనాల ప్రాతిపదికన ఈ సూచీ రూపొందిస్తారు. ఈ సూచీలో 0-100 వరకూ స్కోర్ ఉంటుంది. సున్నా స్కోర్ ఉంటే పూర్తిగా అవినీతిగా.. 100 స్కోర్ సాధిస్తే అవినీతి రహితమైనదిగా పరిగణిస్తారు. ఈ జాబితాలో డెన్మార్క్ మొదటి స్థానంలో నిలిచింది. 100కు 90 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. డెన్మార్క్ తర్వాత 88 పాయింట్లతో ఫిన్లాండ్ రెండో స్థానంలో ఉంది. ఇక 84 పాయింట్లతో సింగపూర్ మూడో స్థానంలో, 83 పాయింట్లతో న్యూజిలాండ్ నాలుగోస్థానంలో , 81 పాయింట్లతో లక్సంబర్గ్ ఐదో స్థానంలో నిలిచాయి.
ఇక ఈ జాబితాలో భారత్ (India) 38 పాయింట్లతో 96వ స్థానంలో నిలిచింది. గతంతోపోలిస్తే భారత్ మూడు స్థానాలకు పడిపోయింది. 2023లో 39 పాయింట్లతో 93వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఇక 2022లో 40 పాయింట్లతో 85వ స్థానంలో నిలవగా.. తాజాగా 96వ స్థానంలో నిలవడం గమనార్హం. భారత్ పొరుగు దేశాలైన పాకిస్థాన్ 27 పాయింట్లతో 135వ ర్యాంకు, శ్రీలంక 32 పాయింట్లతో 121వ ర్యాంకు, బంగ్లాదేశ్‌లు 149వ ర్యాంకులో నిలిచాయి. తాలిబన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ 17 స్కోరుతో 165వ స్థానంలో ఉంది. ఇక ఈ జాబితాలో చైనా 76వ స్థానంలో ఉంది.
ఇక ఈ జాబితాలో అత్యంత అవినీతిమయమైన దేశంగా సౌత్ సుడాన్ నిలిచింది. ఈ జాబితాలో సౌత్ సుడాన్ 180వ ర్యాంక్‌తో 08 స్కోర్ సాధించింది. ఆ తర్వాత సొమాలియా (09 స్కోర్), వెనుజులా (10), సిరియా (12), యోమన్ (13), లిబియా (13), ఈక్వటోరియల్ గునియా (13), నికరాగ్వా (15)తో అత్యంత అవినీతిమయమైన దేశాలుగా నిలిచాయి.
Also Read..
Rahul Gandhi | ఆర్మీపై వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు