రుద్రంపూర్, జూలై 07 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్లుగా ఎస్ఐఆర్ పేరుతో అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి తొలగించకూడదు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన అత్యంత విలువైన ప్రజాస్వామ్య హక్కు అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం బీఆర్ఎస్ పార్టీ మండల నాయకుడు గూడెల్లి యాకయ్య అన్నారు. మంగళవారం రుద్రంపూర్ పంచాయతీ పరిధి 7వ వార్డులో ఇన్చార్జి ఎన్.డి.రవితేజ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల భర్తీపై అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అధికారులు పారదర్శకంగా వ్యవహరించి ప్రతి అర్హుడి ఓటును పరిరక్షించాలి. ప్రజలు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఎన్యూమరేషన్ ఫారాలను సక్రమంగా నింపి తమ ఓటు హక్కును కాపాడుకోవాలన్నారు.
ఈ సందర్భంగా బీఎల్వోల ద్వారా స్వీకరించిన ఎన్యూమరేషన్ ఫారాలను ఎలా నింపాలో ప్రజలకు వివరించారు. 2002 ఓటరు జాబితాలో ఉన్న పోలింగ్ బూత్ నంబర్, క్రమ సంఖ్య వివరాలను అందజేసి, ఫారాలను సక్రమంగా పూరించే విధానాన్ని తెలియజేశారు. అలాగే ఓటర్లకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు. ఈ అవగాహన శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో రుద్రంపూర్ మాజీ సర్పంచ్ గుమ్మడి సాగర్, మునవర్, ముఖేష్, అజార్ పాల్గొన్నారు.